బీజేపీలోకి ఏపీ మాజీ మంత్రి..! జేపీ నడ్డాతో భేటీ

బీజేపీలోకి ఏపీ మాజీ మంత్రి..! జేపీ నడ్డాతో భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తప్పదా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు.. తెలంగాణ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కొన్నాళ్లుగా బీజేపీలో చేరతారంటూ ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యతో కలిసి ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆదినారాయణరెడ్డి.. జేపీ నడ్డాతో మంతనాలు జరిపారు. ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆదినారాయణరెడ్డి అలకబూనారనే వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు సైతం ఆదినారాయణరెడ్డి దూరంగా ఉంటున్నారు. ఇవాళ ఉదయం ఆయన జేపీ నడ్డాతో సమావేశం కావడంతో.. ఆయన త్వరలోనే బీజేపీలో చేరడం ఖాయమంటూ జరుగుతోన్న ప్రచారానికి తెరపడిపోగా.. ఆయన అధికారికంగా కండువా కప్పుకోవడమే మిగిలిపోయింది.

తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఇతర  పార్టీల నేతలను ఆహ్వానిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఏపీలోని టీడీపీకి చెందిన నేతలు ఓ విధంగా బీజేపీలోకి క్యూకట్టే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఇప్పటికే చాలా మంది బీజేపీలో చేరిపోగా.. ఏపీకి చెందిన టీడీపీ కీలక నేతలు సైతం కమలం గూటికి చేరారు. ఇక, ఆదినారాయణరెడ్డితో బీజేపీలో చేరితే.. రాయలసీమ ప్రాంతం నుంచి మరికొందరు నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.