రోడ్ షో జరుపుతూ జైలుకి వెళ్లిన నవాజ్ షరీఫ్

రోడ్ షో జరుపుతూ జైలుకి వెళ్లిన నవాజ్ షరీఫ్

అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అనారోగ్య కారణాలపై లభించిన బెయిల్ పై ఆరు వారాలు బయట గడిపిన తర్వాత శిక్ష అనుభవించేందుకు జైలుకి వెళ్లారు. షరీఫ్ కి ఇచ్చిన బెయిల్ గడువు ముగియడంతో మంగళవారం అర్థరాత్రి జైలుకి చేరుకున్నారు. పాకిస్థాన్ సుప్రీంకోర్ట్ అల్-అజీజియా స్టీల్ మిల్స్ అవినీతి కేసులో మార్చి 26న షరీఫ్ కి 6 వారాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన పాకిస్థాన్ విడిచి బయటకు వెళ్లడంపై నిషేధం విధించింది.

మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ (69) గత నెల చికిత్స కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి కోరారు. కానీ ఆయనకు అనుమతి లభించలేదు. షరీఫ్ కుమార్తె మరియమ్ నేతృత్వంలో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించింది. తమ వ్యక్తిగత నివాసం జాతి ఉమ్రా నుంచి కోట్ లఖ్ పత్ జైల్ వరకు సాగిన ఈ ర్యాలీ ద్వారా షరీఫ్ తన బలప్రదర్శన చేశారు. షరీఫ్ కుమార్తె మరియమ్, సోదరుడి కుమారుడు హమ్జా షాబాద్, వేలాదిగా పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు మాజీ ప్రధాని వెంట జైలు వరకు వెళ్లారు. షరీఫ్ నివాసం బయట పీఎంఎల్-ఎన్ కి చెందిన వేలాది మద్దతుదారులు చేరుకొని ర్యాలీ వెంట సాగారు.

షరీఫ్ ఇంటి నుంచి కోట్ లఖ్ పత్ జైలుకి 30 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా 4 గంటల సమయం పట్టింది. బెయిల్ గడువు మంగళవారం అర్థరాత్రితో ముగిసింది. షరీఫ్ లండన్ లో చికిత్స కోసం అనుమతి కోరుతూ పునర్విచారణ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని తిరస్కరించింది. జైలుకి చేరిన తర్వాత నవాజ్ తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.