టీడీపీకి మరో షాక్...బీజేపీలో చేరిన కీలక నేత

టీడీపీకి మరో షాక్...బీజేపీలో చేరిన కీలక నేత

ఎట్టకేలకు కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన కమలం గూటికి చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి సెప్టెంబర్ 11నే టీడీపీకి రాజీనామా చేశారు. మరుసటి రోజు ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారని వార్తలొచ్చాయి.

కానీ ఆయన ఈరోజు ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి కొద్ది రోజులకే బాబు సన్నిహితుడిగా మారి మంత్రి పదవిని పొందారు. 2019 ఎన్నికల్లో ఆయన కడప నుంచిఎంపీగా పోటీ చేసి ఓడారు. ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ నేతలతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఆదినారాయణరెడ్డి వ్యవహరించారు. జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు కొంతమంది నేతల మీద ప్రతీకార చర్యలకు కూడా దిగిందని భావించిన ఆయన బీజేపీ గూటికి చేరారని ప్రచారం జరుగుతోంది.