డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి రేసులో మాజీ ఉపాధ్యక్షుడు 

డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి రేసులో మాజీ ఉపాధ్యక్షుడు 

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి రేసులో నిలుస్తానని ప్రకటించారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోలో బిడెన్ ఈ ప్రకటన చేశారు. 'ఈ దేశ ఆత్మ కోసం మనం ఈ పోరాటంలో నిలుస్తున్నాం' అని జో బిడెన్ అన్నారు.

'మనం డొనాల్డ్ ట్రంప్ ను ఎనిమిదేళ్లు వైట్ హౌస్ లో ఉండనిస్తే అతను ఈ దేశ వ్యక్తిత్వాన్ని సమూలంగా, శాశ్వతంగా మార్చేస్తాడని' బిడెన్ చెప్పారు. 'మనం ఎవరం? అలా జరగడాన్ని నేను మౌనంగా చూస్తూ నిల్చోలేను' అన్నారు. 

ఎన్నో నెలలుగా బిడెన్ పోటీలో నిలబడాలా వద్దా అనే విషయంపై తర్జనభర్జనలు పడ్డారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై పలు ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. 76 ఏళ్ల బిడెన్ అధ్యక్ష పదవికి మరీ పెద్దవాడవుతారా? కొత్త ముఖాల కోసం అన్వేషిస్తున్న డెమోక్రటిక్ పార్టీలో మరీ మధ్యేవాదిగా అవుతారా? గొంతు పెంచుతున్న పార్టీలోని ఉదారవాద వర్గాన్ని సంతృప్తి పరచగలరా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే నాలుగేళ్లు పెద్దవాడైన బిడెన్, ఎన్నికల్లో విజయం సాధిస్తే అత్యంత పెద్ద వయసులో అధ్యక్షుడైన వ్యక్తిగా నిలుస్తారు. తను 'ఒబామా-బిడెన్ డెమోక్రాట్'గా ప్రచారం చేస్తానని జో బిడెన్ చెప్పారు. ఒబామాను చారిత్రక సంఖ్యలో బలపరిచిన శ్రామిక శ్వేత జాతీయ ఓటర్లు, యువ, విభిన్న ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకొని బిడెన్ బరిలోకి దిగుతున్నారు.