భారీ భద్రత మధ్య చర్లపల్లికి నిందితులు... వ్యాన్‌లో పడుకోబెట్టి తరలింపు..!

భారీ భద్రత మధ్య చర్లపల్లికి నిందితులు... వ్యాన్‌లో పడుకోబెట్టి తరలింపు..!

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆ నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.. నిందితులపై జనం దాడి చేయకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. నిందితులను తరలించే వాహనాలకు ముందు, వెనక పోలీసు వాహనాలను ఏర్పాటు చేశారు. నిందితుల వాహనంపై దాడి జరిగితే వెంటనే స్పందించేలా పోలీసు సిబ్బందిని ఆ వాహనాల్లో తీసుకెళ్లారు. అలాగే జనం రాళ్లతో దాడి చేసినా వారికి గాయాలు కాకుండా.. వారిని వాహనంలో పడుకోబెట్టారు. అంతకు ముందు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఐదు గంటలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని కొందరు.. తమకు అప్పగిస్తే తామే శిక్షిస్తామంటూ మరికొందరు ఆందోళనకు దిగారు. 

దీంతో జనాన్ని అదుపుచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొందరు పోలీసుల పైకి రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో స్పల్ప లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు పోలీసులు. ఇదిలా ఉండగా.. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మేజిస్ట్రేట్ పాండు నాయక్ ఎదుట నలుగురు నిందితులను హాజరుపర్చారు పోలీసులు. దీంతో నలుగురు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారాయన. మరోవైపు పీఎస్‌లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వచ్చిన డాక్టర్లు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రిమాండ్ విధించిన తర్వాత భారీ భద్రత మధ్య వారిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.