ఒక ఫ్యామిలీ నుంచి నలుగురు పోటీ?

ఒక ఫ్యామిలీ నుంచి నలుగురు పోటీ?

ఒకరో ఇద్దరో.. మహా అయితే ముగ్గురు..! ఒకే కుటుంబం నుంచి ఇంతకంటే ఎక్కువ మందికి ఒకే ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం రాదు. కానీ.. ఈ రికార్డును ఓ కుటుంబం బ్రేక్‌ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ముగ్గురికి టికెట్లు దక్కించుకున్న ఈ పొలిటికల్‌ ఫ్యామిలీకి.. నాలుగో టికెట్‌ కూడా వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. 

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కింజరాపు ఎర్రన్నాయడు మరణం తర్వాత ఆయన వారసుడిగా కుమారుడు రామ్మోహన్‌నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అంతకు ముందు ఎర్రన్నాయుడు ఉన్నప్పుడు.. ఆయన ఎంపీగా పోటీ చేస్తే, సోదరుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అదే తరహాలలో 2014లో రామ్మోహన్‌నాయుడు ఎంపీగా పోటీ చేస్తే బాబాయ్‌ అచ్చెన్నాయుడు శాసనసభ బరిలో దిగారు. ఈసారి ఈ కుటుంబం నుంచి వీరిద్దరే కాకుండా మరో ఇద్దరు కూడా బరిలోకి దిగబోతున్నారు.

ఎర్రన్నాయుడు కుమార్తె భవానీకి రాజమండ్రి అర్బన్ టికెట్‌ ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. భవానీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు కూడా. భవానీ కూడా పోటీ చేస్తుండడంతో రామ్మోహన్‌నాయుడి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్న వారి సంఖ్య ముగ్గురికి పెరిగింది. 

ఇక.. రామ్మోహన్‌నాయుడి మామ బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆయనే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. నిన్న విడుదల చేసిన జాబితాలో పెందుర్తిని పెండింగ్‌లో పెట్టినప్పటికీ.. బండారుకు టికెట్‌ దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది. వాస్తవానికి బండారు చాలా సీనియర్‌ నేత. పలు దఫాలు ఎన్నికల్లో పోటీ చేశారు. మంత్రిగానూ పనిచేశారు. రెండేళ్ల క్రితం తన కుమార్తెను రామ్మోహన్‌కు ఇచ్చి వివాహం చేయడంతో బండారు కుటుంబం కూడా కింజరాపు కుటుంబంలో భాగమైపోయింది.

ఈ నేపథ్యంలో.. సత్యనారాయణకు కూడా టికెట్‌ వస్తే ఈ ఫ్యామిలీ హిస్టరీని క్రియేట్‌ చేసినట్టేనని చెప్పొచ్చు. టీడీపీ నుంచి  ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పోటీ చేసే అవకాశం ఇంతవరకూ ఎవరికీ దక్కలేదు. ఐతే.. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్న చంద్రబాబు.. పార్టీ నియమాలను కాస్త సడలించినట్టు కనిపిస్తోంది.