టీడీపీలో భారీ కుదుపు..!?

టీడీపీలో భారీ కుదుపు..!?

సార్వత్రిక ఎన్నికల్లో ఊహించన ఫలితాలతో షాక్ తిన్న తెలుగుదేశం పార్టీకి మరో భారీ కుదుపు తప్పేలా లేదు. టీడీపీకి గుడ్‌బై చెప్పి నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక రాజ్యసభ సభ్యులతోపాటు పార్టీని వీడేందుకు టీడీపీ కాపు సామాజిక నేతలు సిద్ధమవుతున్నారని సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై కాకినాడలో టీడీపీ కాపు నేతలు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. పార్టీని వీడాలని ఇప్పటికే పలువురు టీడీపీ కాపు నేతలపై పార్టీ మారేందుకు సిద్ధమైన టీడీపీ ఎంపీలు ఒత్తిడి తెస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గత పది రోజుల నుంచి టీడీపీ కాపు నేతలతో సంప్రదింపులు టీడీపీ రాజ్య సభ్యులు చర్చలు జరుపుతున్నారని సమాచారం. భవిష్యత్ కార్యాచరణ కోసం కాకినాడలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ కాపు, బలిజ నేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే, ఈ సమావేశానికి మాజీ మంత్రులు ఘంటా శ్రీనివాస్ రావు, చినరాజప్ప, నారాయణ దూరంగా ఉన్నారు. ఇక, బీజేపీలో చేరే యోచనలో వై.ఎస్. చౌదరి (సుజనాచౌదరి), గరికపాటి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌ ఉన్నట్టు బలమైన సంకేతాలు అందుతున్నాయి. వీరంతా రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ రోజు సాయంత్రం కల్లా దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.