భారీ ఎత్తున భారత్ లో ఐఫోన్ల తయారు చేయనున్న ఫాక్స్ కాన్

భారీ ఎత్తున భారత్ లో ఐఫోన్ల తయారు చేయనున్న ఫాక్స్ కాన్

సుప్రసిద్ధ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తయారుచేసే ఐఫోన్లకి ప్రపంచవ్యాప్తంగా ఎంత గిరాకీ ఉందో తెలిసిందే. ఇక యాపిల్ ఐఫోన్లను భారత్ లోనే ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుంచి ఐఫోన్లను భారీ ఎత్తున భారత్ లో ఉత్పత్తి చేయనున్నట్టు ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ టెరీ గోవు ప్రకటించారు. తమ కంపెనీ భారత్ లో విస్తరణ ఆలోచనలో ఉండటంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ రావాల్సిందిగా తనను ఆహ్వానించినట్టు గోవు తెలిపారు. యాపిల్ ఐఫోన్లలో కొన్ని పాత మోడళ్లని కొన్నేళ్లుగా బెంగుళూరులోనే తయారు చేస్తున్నారు. ఇకపై కంపెనీ లేటెస్ట్ మోడళ్లని కూడా భారత్ లోనే ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. భారత్ లో లేటెస్ట్ ఐఫోన్ల ట్రయల్ ప్రొడక్షన్ కి ఫాక్స్ కాన్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారత్. చైనా మార్కెట్లో ఏర్పడ్డ ఆటంకాల కారణంగా యాపిల్ సంస్థ.. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలైన హువావీ, షావోమీ వంటి సంస్థలకు తమ మార్కెట్ షేర్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ లో యాపిల్ మార్కెట్ వాటా చాలా స్వల్పంగా ఉంది. దీనికి ముఖ్య కారణం ధరలు అధికంగా ఉండటమే. భారత్ లో ఉత్పత్తి ప్రారంభిస్తే కంపెనీకి దిగుమతి సుంకంలో 20 శాతం మినహాయింపు లభిస్తుంది. భవిష్యత్తులో తాము భారత స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో కీలక పాత్ర పోషించనున్నట్టు గోవు చెప్పారు.

కంపెనీ చేపడుతున్న ఈ చర్యతో చైనా కార్యకలాపాలు ఏ మేరకు ప్రభావితం అవుతాయో చెప్పలేమంటున్నారు మార్కెట్ నిపుణులు. గత కొన్నేళ్ల నుంచి చైనా కంపెనీకి భారత్ మాన్యుఫాక్చరింగ్ బేస్ గా ఉంది. ఫాక్స్ కాన్ కి భారత్ లో రెండు అసెంబ్లీ సైట్లు ఉన్నాయి. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో మరొకటి తమిళనాడులో ఉన్నాయి. ఫాక్స్ కాన్ అసెంబ్లీ లైన్ హోన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ స్థానిక, ఎగుమతి మార్కెట్లలో తన సేవలు అందించనుంది. యాపిల్ సెప్టెంబర్ లో తన కొత్త ఐఫోన్ మోడల్ ని ప్రకటించే వరకు ఇది ఇలాగే పనిచేయనుంది. ఈ ప్రాజెక్ట్ ఆరంభంలో 300 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నారు.