మసూద్ అజర్ పై ఫ్రాన్స్ ఆంక్షలు..

మసూద్ అజర్ పై ఫ్రాన్స్ ఆంక్షలు..

జేషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్‌ పై ఫ్రాన్స్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అతడి ఆస్ధులను స్తంభింపచేస్తూ.. ఫ్రాన్స్ దేశ ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్‌ అజర్‌ పేరును ఐరోపా యూనియన్‌ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్‌ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ఉగ్రదాడి తర్వాత అజర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని పలు దేశాలు డిమాండ్లు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 15 సభ్య దేశాలు గల ఐరాస భద్రతా మండలిలో కీలకమైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఈసారి ముందడుగు వేశాయి. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఈ మూడు దేశాలూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదనలు ప్రవేశపెట్టాయి. ప్రపంచంలో ఎక్కడా పర్యటించకుండా అతణ్ణి బ్యాన్ చేయాలని, ఆస్తులు.. ఆయుధాలు సీజ్ చేయాలని డిమాండ్ చేశాయి.