అంబానీకి వందల కోట్ల లబ్ది

అంబానీకి వందల కోట్ల లబ్ది

రాఫెల్‌ డీల్‌ కుదుర్చుకుంటున్న సమయంలో  రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత అనిల్‌ అంబానీకి భారీ మొత్తంలో రాయితీని ఫ్రాన్స్‌ ప్రభుత్వం కల్పించిందా? ఫ్రాన్స్‌కు చెందిన లే మోండే (ద వరల్డ్‌) పత్రికలో ఈ మేరకు ప్రత్యేక కథనం వెలువడింది. అనిల్‌ అంబానీకి ఫ్రాన్స్‌లో రిలయన్స్‌ అట్లాంటిక్‌ ఫ్లాగ్‌ ఫ్రాన్స్‌ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ యూరప్‌ నుంచి అమెరికాకు ట్రాన్స్‌ అట్లాంటిక్‌ సబ్‌ మెరైన్‌ టెలికమ్యూనికేషన్స్‌ సర్వీస్‌ను అందిస్తోంది. ఈ కంపెనీ భారత్‌లో అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు అనుబంధ కంపెనీగా ఉంది. ఫ్రాన్స్‌లో వ్యాపారం చేస్తున్న ఈ అనిల్‌ అంబానీ కంపెనీ అనేక సంవత్సరాలుగా అక్కడ పన్నులు కట్టకుండా దాటేస్తోంది. 2007 నుంచి 2010 వరకు 60 మిలియన్ల యూరోలు... 2010 నుంచి 2012 వరకు ఈ కంపెనీ 91 మిలియన్‌ డాలర్లు ఫ్రాన్స్‌ పన్ను విభాగానికి బకాయి పడింది. 2015 ఏప్రిల్‌ అంటే రాఫెల్‌ డీల్‌పై ఫ్రాన్స్‌, భారత్‌ మధ్య చర్చలు జరుగుతున్న సమయానికి ఈ మొత్తం 151 మిలియన్‌ యూరోలకు చేరింది. అంటే మన కరెన్సీలో రూ.1125 కోట్లుకు సమానం. రాఫెల్‌ డీల్‌ కుదిరిన కేవలం ఆరు నెలలకే ఫ్రాన్స్‌ పన్ను శాఖ అధికారులు కేవలం రూ. 59 కోట్లు తీసుకుని... మిగిలిన మొత్తాన్ని మాఫీ చేసిందని ద వరల్డ్‌ పత్రిక పేర్కొంది. దాదాపు 143.7 మిలియన్‌ యూరోల పన్ను బకాయిలను ఫ్రాన్స్‌ రద్దు చేసిందని ఈ ప్రతిక పేర్కొంది. 2015 ఫిబ్రవరి, అక్టోబర్‌ మధ్య కాలంలో ఈ డీల్‌ కుదిరిందని పేర్కొంది. రాఫెల్‌ డీల్‌లో భాగంగానే ఈ పన్ను రాయితీ కూడా ఇచ్చారని ద వరల్డ్‌ పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారం పొందేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని ఈ కథనం రాసిన జర్నలిస్ట్‌ జులియన్‌ బొయూసు అన్నారు.