ఫ్రాన్స్ కంటే భారత్ 2.5 రెట్లు ఎక్కువ చెల్లిస్తోంది

ఫ్రాన్స్ కంటే భారత్ 2.5 రెట్లు ఎక్కువ చెల్లిస్తోంది

రాఫెల్ ప్రస్తావనపై చిరాకు పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి మరో షాకింగ్ న్యూస్. ఫ్రాన్స్ ప్రభుత్వం 28 రాఫెల్ యుద్ధ విమానాలను 2.3 బిలియన్ యూరోలకే కొనుగోలు చేసేలా రాఫెల్ ఫైటర్ జెట్స్ తయారీ సంస్థ దసాల్ట్ తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వార్త భారత్ లో పెద్ద కలకలం సృష్టిస్తోంది. మోడీ ప్రభుత్వం 36 రాఫెల్ విమానాలకు 7.8 బిలియన్ యూరోలు చెల్లించేలా దసాల్ట్ తో ఒప్పందం చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ అంక గణితాన్ని వివరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. 

భారత ప్రభుత్వం సంతకాలు చేసిన రాఫెల్ డీల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ వార్తపై మండిపడ్డారు. ట్విట్టర్ లో ‘ఫ్రెంచ్ ప్రభుత్వం 28 రాఫెల్ అధునాతన యుద్ధవిమానాలకు 2 బిలియన్ యూరోలు మాత్రమే చెల్లిస్తోంది. మరోవైపు మోడీ 36 రాఫెల్ జెట్లను 7.87 బిలియన్ యూరోలకు కొంటున్నారు. ఫ్రాన్స్ ఒక్కొక్క విమానానికి చెల్లిస్తున్న మొత్తం కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ. ఆఫ్ సెట్ గా అంబానీకి రూ.30,000 కోట్లు కమిషన్ గా ఇచ్చేందుకు మనని దోచేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

ఫ్రాన్స్ ప్రభుత్వ ఒప్పందం ప్రకారం దసాల్ట్ ఏవియేషన్ ఎఫ్4 నాణ్యతా ప్రమాణాలతో యుద్ధ విమానాలను 2024 నాటికి అభివృద్ధి చేస్తుంది. వీటిలో కొన్ని 2022 నాటికే సిద్ధమవుతాయి. ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ కి 2023 నుంచి డెలివరీ ప్రారంభమవుతుంది. 2023లో మరో 30 పూర్తిగా ఎఫ్4 ప్రమాణాల విమానాలను ఫ్రాన్స్ కొనుగోలు చేస్తుందని ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ ఫార్లీ ప్రకటించారు. వీటి డెలివరీ 2027-2030 మధ్య పూర్తవుతుంది.