మోడీ తిరిగి అధికారానికి రావడం 50% మాత్రమే

మోడీ తిరిగి అధికారానికి రావడం 50% మాత్రమే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019లో తిరిగి అధికారం దక్కించుకొనే అవకాశం ఎంత? 2017లో 99 శాతం ఉంటే ఇప్పుడు అది కాస్తా జారి దిగజారి 50 శాతం మాత్రమే. ఇది ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు రుచిర్ శర్మ మాట. గత ఎన్నికల్లో వేర్వేరుగా బీజేపీతో తలపడ్డ ప్రతిపక్షాలు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోయే అవకాశాలు కనిపిస్తుండటంతో మోడీకి 2019 ఎన్నికలు నల్లేరుపై బండి నడక ఎంత మాత్రం కాదంటున్నారు రుచిర్ శర్మ. 2014 ఎన్నికల్లో విపక్షాలు ఎవరికి వారుగా పోటీ చేయడంతో బీజేపీకి 31 శాతం ఓట్ షేర్ వచ్చినప్పటికీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం వచ్చింది. ఎందుకంటే ఆ పార్టీకి పడే ఓట్లు చెక్కుచెదరకుండా పడ్డాయని రుచిర్ శర్మ తన కొత్త పుస్తకం ‘డెమోక్రసీ ఆన్ రోడ్’ లో విశ్లేషించారు.

2019 ఎన్నికలు పూర్తిగా విభిన్నంగా ఉండబోతున్నాయి. తనే కనుక బెట్టింగ్ వేస్తే గత ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ హవా చూసిన తర్వాత మోడీ తిరిగి అధికారానికి రావడం ఖాయమని 99-1గా పందెం కాసేవాడినని రుచిర్ శర్మ చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు నాటకీయంగా మారి అధికార, విపక్షాలు రెండిటికి 50-50 అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా నిర్ణాయకంగా మారేది సంకీర్ణాలేనని తెలిపారు. గతంలో ముక్కచెక్కలుగా ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయని దీంతో పోటీ రసవత్తరం కానుందని శర్మ అన్నారు.

ప్రపంచ రాజకీయాలపై ముఖ్యంగా భారత్ పై సాధికార పట్టు ఉన్న రుచిర్ శర్మ ఫిబ్రవరిలో విడుదల కాబోయే తన కొత్త పుస్తకంలో దేశంలో ప్రజాస్వామ్యం పనితీరుని, ఎన్నికలపై ప్రత్యేక దృష్టితో విశ్లేషించారని భావిస్తున్నారు. 1990ల నుంచి ఇప్పటి వరకు 24 ఎన్నికలను పరిశీలించిన శర్మ2004 నాటి ఎన్నికలను విశ్లేషించారు. అప్పటి ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజపేయి, ప్రతిపక్షాల మధ్య ఉన్న ప్రజాదరణలో తేడాయే ఇప్పుడు ప్రధాని మోడీ ప్రతిపక్షాల మధ్య కనిపిస్తోందన్నారు. బీజేపీ కేవలం 31 శాతం ఓట్ షేర్ తో అధికారం చేపట్టగలిగందంటే విపక్షాలు ఛిన్నాభిన్నం కావడమే ప్రధాన కారణమని తెలిపారు. ఓట్ షేర్ తో పోలిస్తే బీజేపీకి వచ్చిన సీట్లు చాలా ఎక్కువన్నారు.

అప్పుడు వాజపేయికి వ్యతిరేకంగా కూడా ప్రతిపక్షాలు ఒక్కటై పోరాడినపుడు కూడా ఇప్పటిలాగానే ప్రధాని ఎవరనే ప్రశ్న తలెత్తిందని శర్మ గుర్తుచేశారు. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి 2004 ఎన్నికల్లో ఓటమి తప్పలేదని మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నెమరేసుకున్నారు. కేంద్రంలో అధికారానికి వచ్చేందుకు ఉత్తరప్రదేశ్ పై పట్టు సాధించాలన్న విషయంపై మాట్లాడుతూ ఇప్పటికీ ఓట్లు కులాల ప్రాతిపదికపై వేస్తున్నందువల్ల ఆ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ చేతులు కలిపితే తిరుగుండదని లేకపోతే బీజేపీ పని సులువవుతుందని చెప్పారు. 30 ఏళ్లుగా ఆ పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. అగ్రవర్ణాల వారు బీజేపీకి, దళితులు మాయావతికి కళ్లు మూసుకొని వేస్తారు తప్ప అభివృద్ధి అనేది వారి దృష్టిలో ఒక అంశమే కాదని ఆవేదన వ్యక్తం చేశారు.