మాల్యా నుంచి దొరికేది 'సున్నా'

మాల్యా నుంచి దొరికేది 'సున్నా'

ఇంగ్లండ్‌లో మాల్యాకు ఉన్న ఆస్తులను పరిశీలించేందుకు,జప్తు చేసేందుకు అనుమతి లభించినా... భారత బ్యాంకులకు దక్కేదేమీ లేదని తేలింది. ఇది వరకే కోర్టుల్లో వేసిన పిటీషన్లలో ఇంగ్లండ్‌లో మాల్యా ఆస్తులుగా చెబుతున్న వాటిల్లో ఆయనకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తు సంస్థలు కూడా పేర్కొన్నాయి. ఇపుడు మాల్యా కూడా ఓపెన్‌గా బ్యాంకులకు ఛాలెంజ్‌ కూడా చేశాడు. తన వద్ద ఏమీ లేదని, కొన్ని ఆభరణాలు, కొన్ని కార్లు ఉన్నాయని చెప్పాడు. దర్యాప్తు సంస్థలు సమయం, స్థలం చెబితే అక్కడివచ్చి తానే అందజేస్తానని ఆయన మీడియాతో అన్నారు. 
అస్సల్లేవా..?
చిత్రమేమిటంటే ఇంగ్లండ్‌లో మాల్యాకు ఆస్తులు ఉన్నాయి. కాని ఆస్తులన్నీ ఓ కంపెనీ పేరుతో ఉన్నారు. ఆ కంపెనీ ఎక్కడ ఉందంటే. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవీస్‌లో ఉంది. విచిత్రమేమిటంటే ఆ దేశంతో మనకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. కాబట్టి మనం ఎలాంటి చర్యలు తీసుకోలేం. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవీస్‌లో పౌరసత్వం...ఓ వ్యక్తి పెట్టే పెట్టుబడిని బట్టి ఉంటుంది. ఆ దేశంలో భారీ పెట్టుబడులు పెట్టినవారికి పౌరసత్వం ఆటోమేటిగ్గా లభిస్తుంది.
అంతా అక్కడే...
హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఉన్న ఆస్తులన్నీ మాల్యావేనని దర్యాప్తు అధికారులకు తెలుసు. మాల్యా ఉండేది 18/19 కార్న్‌వాల్‌ టెర్రస్‌లో. ఇది రోస్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ (ఆర్‌సీవీ) అనే కంపెనీకి చెందినది. ఈ ఆస్తులపై హక్కులను ఆర్‌సీవీ నుంచి  తీసుకున్నారు మాల్యా.  మరి ఈ ఆర్‌సీవీ ఎక్కడి. ఈ కంపెనీ నల్లధన కుబేరుల స్వర్గధామ్ం బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్‌లో ఉంది. ఈ కంపెనీ గ్లాడ్‌కో ప్రాపర్టీస్‌ ఇన్‌కార్పొరేటెడ్‌కు చెందినది. ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. ఈ గ్లాడ్‌కో కంపెనికి  యజమాని మరో కంపెనీ. దాని పేరు కాంటినెంటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఏఎస్‌ఎల్‌). ఇది మాల్యా కుటుంబానికి చెందిన సిలేటా ట్రస్ట్‌ది. సీఏఎస్‌ఎల్‌ ఉండేది ఎక్కడంటే... సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవీస్‌లో. సో మన అధికారులు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు.
ఇది కూడా...
మాల్యాకు వందల కోట్ల విలువ చేసే హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌ ఎస్టేట్‌ ఉంది. దీన్ని లేడీవాక్‌ ఎల్‌ఎల్‌పీ అనే  కంపెనీకి తాకట్టు పెట్టారు. లేడీవాక్‌ ఎల్‌ఎల్‌పీలో ఇద్దరు వాటాదారులు ఉన్నారు. వీరిలో ఒకరు ఇందాక చెప్పుకున్న సీఏఎస్‌ఎల్‌. మరో వాటాదారు  స్విట్జర్‌ల్యాండ్‌కు చెందిన ఆండ్రియా రిషాల్‌ వల్లభ్‌. ఈ వల్లభ్ ఎవరో కాదు... సీఏఎస్‌ఎల్‌లో డైరెక్టర్‌. అంటే సీఏఎస్‌ఎల్‌ చుట్టూనే సాగుతోందన్నమాట. సీఏఎస్‌ఎల్‌ కంపెనీ బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్‌లోనే ఉన్న లేడీవాక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అనే కంపెనీ ఓనర్‌ సిలెటా హోల్డింగ్స్‌. ఈ సిలెటా హోల్డింగ్స్‌కు యజమాని మళ్ళీ సీఎస్‌ఎల్‌ఏ కంపెనీనే. 2015లో హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌ ఎస్టేట్‌ కొనుగోలు చేసేందుకు 65.4 కోట్లను లేదీవాక్‌ఎల్ఎల్‌పీకి సీఎస్‌ఎల్‌ఏ రుణంగా ఇచ్చింది. అంటే ఈ రెండు ఆస్తులూ పరోక్షంగా మాల్యా ఫ్యామిలీ చేతిలోనే ఉన్నాయి. కాకపోతే ఈ ఆస్తుల అసలు యజమాని అయిన కంపెనీ మాత్రం సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌లో నమోదై ఉంది. పాపం.. మన దర్యాప్తు అధికారులు మాత్రం ఏం చేస్తారు?
సో... లండన్‌ కోర్టుల నుంచి అనుమతి లభించినా... సీబీఐ లేదా ఈడీ స్వాధీనం చేసుకోవడానికి ఇంగ్లండ్‌లో ఏమీ లేవు. అదన్నమాట సంగతి.