అనంత రోడ్ల వెడెల్పుకు జీవో జారీ

అనంత రోడ్ల వెడెల్పుకు జీవో జారీ

ఎట్టకేలకు జేసీ దివాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. అనంతపురం నగరంలో అభివృద్ధి పనులు జరగటం లేదని ఆయన గత కొన్నాళ్లుగా పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సమావేశాలకు వెళ్లనని అలకబూనారు. దీంతో పార్టీ ఆయనను టీడీపీ బుజ్జగించింది. జేసీ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ముఖ్యంగా అనంతపురం నగరంలోని రోడ్ల వెడల్పు పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా... స్పందన అంతంత మాత్రమే. 

ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అందులో ఏపీకి జరిగిన అన్యాయంపై మొదటిరోజే టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఇదే అవకాశంగా భావించి జేసీ... అలక పాన్పు ఎక్కారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు కాని తేల్చి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ జేపీ డిమాండ్లలో ఒకటైన అనంతపురం రోడ్ల వెడల్పు కోసం రూ.45.56 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈమేరకు జీవోను సైతం విడుదల చేసింది. ఈ నిధులతో నగరంలోని తిలక్ రోడ్డు లోని నీలం టాకీస్ జంక్షన్ నుంచి గాంధీ విగ్రహం వరకు రోడ్డు వెడల్పు చేయాలని నిశ్చయించారు. 

ఈ నిధుల్లో రోడ్డుకు ఇరువైపుల భూ సేకరణకు రూ.26.35 కోట్లు కేటాయించారు. ఇరువైపుల ఉండే వాటిని తొలగించేందుకు రూ. 15.96 కోట్లు నిధులు విడుదల చేశారు. రోడ్ల నిర్మాణం , సీసీ పేవ్ మెంట్స్ కోసం  రూ.2.62 కోట్లు ఇచ్చారు. ఇక త్వరలో అనంతపురం నగరంలో రోడ్లు వెడల్పు కార్యక్రమం మొదలుకానుంది. నగరంలో నిలిచిపోయిన రోడ్ల వెడల్పు కార్యక్రమానికి జేసీ దివాకర్ రెడ్డి అలకతో మోక్షం వచ్చినట్లైంది. సమస్య పరిష్కారం కావటంతో పార్లమెంటు సమావేశాలకు వెళ్లేందుకు జేసీ సమాయత్తం అవుతున్నారని సమాచారం.