భవిష్యత్ ఐఫోన్లలో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్?!

భవిష్యత్ ఐఫోన్లలో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్?!

అమెరికా టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన సుప్రసిద్ధ ఐఫోన్లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. విశ్వసనీయ యాపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో, మాక్ రూమర్స్ వెబ్ సైట్ ప్రకారం తర్వాతి తరం ఐఫోన్ లలో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉండనున్నట్టు తెలిసింది. ఈ ఫీచర్ తో మీరు మీ ఇతర డివైస్ లను ఐఫోన్ లను ఉపయోగించి ఛార్జింగ్ చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్10, హువావీ మేట్ 20 ప్రో, హువావీ పీ30 ప్రో వంటి ఇతర ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్ తో వచ్చేశాయి. ఈ ఫీచర్ కోసం శాంసంగ్ కొత్తగా బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా విడుదల చేసింది. పవర్ షేర్ ఫీచర్ తో మీరు గెలాక్సీ బడ్స్ కేస్ ని శాంసంగ్ గెలాక్సీ ఎస్10 వెనుకపెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. మరో ఫోన్ లేదా మరో ఉపకరణంతో కూడా మీరు దీనిని ఉపయోగించవచ్చు. కానీ అది ఏదైనా క్యూఐ కంపాటిబుల్ డివైస్ అయి ఉండాలి.

ప్రస్తుతం యాపిల్ తన ఎయిర్ పాడ్స్ ను వైర్ లెస్ ఛార్జింగ్ కేస్ తో అమ్ముతోంది. అందువల్ల రాబోయే ఐఫోన్ పైన అమర్చుకొనే కొత్త కేస్ ను త్వరలోనే యాపిల్ ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.

మింగ్-చి కువో ప్రకారం యాపిల్ తన అన్ని ఉత్పత్తులకు ఈ కొత్త ఫీచర్ చేర్చవచ్చు. ఐఫోన్ ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్, ఎక్స్ఆర్ ల అప్ డేట్స్ లో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్ ఉండవచ్చని కువో అంచనా వేస్తున్నారు. 

అలాగే కొత్త ఫీచర్ తో బ్యాటరీ త్వరగా అయిపోకుండా యాపిల్ తన బ్యాటరీల సైజులను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. తర్వాతి ఐఫోన్ ఎక్స్ఎస్ లో 20-25 శాతం బ్యాటరీ సామర్థ్యం పెరుగుదల ఉండవచ్చు. తర్వాతి ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ లో ఇది 10-15 శాతంగా ఉండవచ్చు. ఇప్పటికే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఐఫోన్ ఎక్స్ఆర్ లో పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చని కువో చెబుతున్నారు.