చీఫ్‌ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి.. విప్‌లుగా..

చీఫ్‌ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి.. విప్‌లుగా..

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఆ తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను నియమించారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమితులు కాగా... ఇక అదే జిల్లాకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడును ప్రభుత్వ విప్‌లుగా నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మరోవైపు, నాలుగుసార్లు రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు. కష్టకాలంలోనూ జగన్‌ వెన్నంటే ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఏ విషయంపైనే పూర్తి అవగాహనతో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడతారని పేరుంది. ఇక రాజ‌కీయాల‌లోకి రాక‌ముందు శ్రీకాంత్ రెడ్డి అమెరికా తెలుగు అసోసియేష‌న్‌లో స‌భ్యుడిగా వ్యవరహించారు. 2004 ఎన్నికల్లో ల‌క్కిరెడ్డిప‌ల్లె అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న తండ్రి త‌ర‌పున ప్రచారం నిర్వహించిన శ్రీకాంత్ రెడ్డి అనంతరం 2009లో అనూహ్యంగా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం బరిలోకి దిగి విజయం సాధించారు. జగన్‌ కేబినెట్‌లో శ్రీకాంత్ రెడ్డికి కీలక పోస్ట్ లభిస్తుందని భావించినా సమీకరణల దృష్ట్యా అది సాధ్యం కాలేదు.. అయితే, రెండున్నరేళ్ల తర్వాత శ్రీకాంత్ రెడ్డికి కీలక పదవి లభిస్తుందనే అంచనాలున్నాయి.