గాలి జ‌నార్ధ‌న రెడ్డి తాజా డీల్‌ వెనుక క‌థ‌ ...

గాలి జ‌నార్ధ‌న రెడ్డి తాజా డీల్‌ వెనుక క‌థ‌ ...

మైనింగ్ డాన్ గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వేధింపుల నుంచి ర‌క్షిస్తాన‌ని హామి ఇచ్చి బెంగ‌ళూరుకు చెందిన ఓ సంస్థ నుంచి సుమారు రూ. 20 కోట్లు గాలి వ‌సూలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కు అంత భారీ మొత్తం ఇచ్చిన సంస్థ ఏమిటి? అస‌లు ఈ తంతంగమంతా ఎలా జ‌రిగిందంటే...

గొలుసుక‌ట్టు కంపెనీ క‌థ‌...
బెంగ‌ళూరులోని డీజే హ‌ల్లిలో స‌య్య‌ద్ ఫ‌రీద్ అహ్మ‌ద్‌, స‌య్య‌ద్ అఫ్తాక్ అహ్మ‌ద్ల‌కు అంబిడెంట్ అనే సంస్థ ఉంది. వీరిద్ద‌రూ తండ్రి కొడుకులు.  40 శాతం నుంచి 50 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ఇస్తామంటూ వీరు జ‌నం నుంచి సొమ్ము వ‌సూలు చేశారు. జ‌నం విశ్వాసం పొందేందుకు చెప్పిన‌ట్లే భారీ మొత్తం ఇన్వెస్ట‌ర్ల‌కు ఇచ్చారు. దీంతో జ‌నం గుడ్డిగా న‌మ్మారు. జ‌నం నుంచి దాదాపు రూ. 600 కోట్లు వ‌సూలు చేసిన త‌ర‌వాత ఈ తండ్రి కొడుకుల నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. వ‌డ్డీ రాక‌పోవ‌డంతో ఇన్వెస్ట‌ర్లు గొడ‌వ చేయ‌డం ప్రారంభించారు. అస‌లుకే ఎస‌రు రావ‌డంతో మ‌రికొంద‌రు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వీరిద్ద‌రిపై 21కేసులు న‌మోదు అయిన‌ట్లు బెంగ‌ళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు అంటున్నారు.

ఐటీ దాడులు
పోంజి స్కీము న‌డుపుతున్నార‌ని, అధిక వ‌డ్డీ ఆశ చూపి భారీ మొత్తం వసూలు చేసిన‌ట్లు తెలియ‌డంతో అంబిడెంట్‌పై 2017లో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. 21 కేసులు న‌మోదు కావ‌డంతో ఈ డీల్‌ చాలా పెద్ద‌ద‌ని వీరికి అనుమానం వ‌చ్చింది. మొత్తం డొంక‌లాగితే దాదాపు 15వేల మంది నుంచి తండ్రికొడుకులు రూ. 600 కోట్లు వ‌సూలు చేసిన రూఢి అయింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) రంగంలోకి దిగి ద‌ర్యాప్తు మొద‌లు పెట్టింది. 

ప‌ట్టి ఇచ్చ‌న బ్యాంక్ ఎంట్రీలు

మ‌రోవైపు బెంగ‌ళూరు సీసీబీ  అధికారులు కూడా ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. అంబిడెంట్ ఖాతాల‌ను త‌ర‌చి చూడ‌గా న‌గ‌రానికి చెందిన అంబికా సేల్స్ కార్పొరేష‌న్ అనే కంపెనీతో అంబిడెంట్ జోరుగా లావాదేవీలు నిర్వ‌హించిన‌ట్లు గుర్తించారు. దాదాపు రూ. 18 కోట్ల డీల్ ఉండ‌టంతో... ఆ సంస్థ య‌జ‌మాని ర‌మేష్ కొఠారిని అద‌పులోకి తీసుకుని విచారించారు. బ‌ళ్ళారికి చెందిన రాజ్‌మ‌హ‌ల్ ఫ్యాన్సీ జ్యువ‌ల్ల‌ర్స్‌తో సద‌రు డీల్  చేసిన‌ట్లు చెప్పారు. బ‌ళ్ళారి దుకాణం నుంచి 57 కిలోల బంగారం కొన్నామ‌ని.. ఈ బంగారాన్ని అలీఖాన్‌కు ఇచ్చిన‌ట్లు తెలిపారు. 

ప‌ట్టి ఇచ్చిన ఫోటోలు

సీసీబీ అధికారులు జ‌రిపిన దాడుల్లో స‌య్య‌ద్ అఖ్త‌ర్‌, స‌య్య‌ద్ ఫ‌రీద్‌ల‌తో క‌లిసి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి తీసుకున్న ఫొటోలు కూడా దొరికాయి. 2018 మార్చిలో వీరంద‌రూ న‌గ‌రంలోని తాజ్ వెస్ట్ ఎండ్  హోట‌ల్‌లో తీసిన‌విగా తేలింది. హెచ్ఎస్ఆర్ లేఔట్‌కు చెందిన బ్రిజేష్ రెడ్డి వీరిద్ద‌రి మ‌ధ్య డీల్ కుద‌ర్చిన‌ట్లు సీసీబీ అధికారుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. డీల్ భాగంగా గాలికి  రూ. 18 కోట్ల విలువైన బంగారు క‌డ్డీలు ఇచ్చిన‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మిగిలిన రెండు కోట్లు క్యాష్ రూపంలో ఇచ్చామ‌ని అంటున్నారు.