గంభీర్‌పై పాక్ మాజీ క్రికెటర్‌ తీవ్ర వ్యాఖ్యలు..

గంభీర్‌పై పాక్ మాజీ క్రికెటర్‌ తీవ్ర వ్యాఖ్యలు..

టీమిండియా మాజీ ఓపెనర్, తాజాగా బీజేపీలో చేరి ఎన్నికలబరిలో నిలిచి ప్రత్యుర్థులపై విరుచుకుపడుతున్న గౌతమ్‌ గంభీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది.. తాను రాసుకుంటున్న ఆత్మకథ ‘గేమ్‌ ఛేంజర్‌’లో తన వయసు గురించి నిజాలు బయటపెట్టిన అఫ్రిది.. మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈసారి గంభీర్‌ను టార్గెట్ చేసి.. తనకు, గంభీర్‌కు మధ్య జరిగిన గొడవలు, గంభీర్‌ వ్యక్తిత్వం గురించి నోరుపారేసుకున్నారు. గేమ్‌ ఛేంజర్‌లో గంభీర్‌పై ఇలా రాసుకొచ్చాడు ‘కొన్ని శత్రుత్వాలు వ్యక్తిగతంగా ఉంటాయి.. మరికొన్ని ప్రొఫెషనల్‌గా ఉంటాయి. గంభీర్ విషయానికి వచ్చే సరికి శత్రుత్వం అనేది వ్యక్తిగతమే. అతడి వైఖరే ప్రధాన సమస్య. గంభీర్‌కు అసలు వ్యక్తిత్వమే లేదు. క్రికెట్‌లో అతడికి గొప్ప రికార్డులేవీ లేవు. ఒక విధమైన వైఖరి తప్ప’ అంటూ పేర్కొన్నాడు. క్రికెట్‌ అనే పెద్ద ప్రపంచంలో అతను ఒక పాత్ర మాత్రమే. కానీ, గంభీర్‌ మాత్రం డాన్‌ బ్రాడ్‌మన్‌, జేమ్స్‌బాండ్‌ లక్షణాలు కలిపి తనలోనే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాడు. చెప్పుకోదగ్గ ఒక్క రికార్డు కూడా గంభీర్‌కు లేదు. కేవలం అతని ప్రవర్తనతోనే అందరి నోళ్లలో నానుతుంటాడు’ ఇక గంభీర్ వైఖరి పోటీ పడేలా ఉండదని, ఎప్పుడూ నెగెటివ్‌గానే ఆలోచిస్తాడని వ్యాఖ్యానించాడు. తాను పాజిటివ్‌గా ఆలోచించే వాళ్లను ఇష్టపడతానని, కానీ, అలా ఉండడని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 2007లో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆసియాకప్‌ సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న గంభీర్‌ ఒక పరుగు పూర్తి చేసి రెండో రన్‌ కోసం పరుగెత్తుతున్న సమయంలో నేరుగా నా ఎదురుగా వచ్చాడు. అప్పుడు ఇద్దరం అసభ్య పదజాలంతో తిట్టుకున్నాం. ఆ విషయాన్ని నేనిప్పటికీ మర్చిపోలేదు. కరాచీలో గంభీర్‌ను తాము ‘సర్యల్‌’(మాడిపోతున్న వాడు) అని పిలుస్తామంటూ అక్కసు వెళ్లగక్కాడు.