కారెక్కిన మరో ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్‌..!

కారెక్కిన మరో ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్‌..!

వరుసగా ఎదురుదెబ్బలు తగులుతోన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు ఆయన భార్య గండ్ర జ్యోతి, భూపాల్‌పల్లి డీసీసీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోందన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. ఇప్పటి వరకు టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్  ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది. ఇక హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు గండ్ర దంపతులు. 

భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ముందువరుసలో నిలిపేందుకు ముఖ్యంత్రి కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీఆర్ఎస్‌ పార్టీతోనే సాధ్యం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రశంసించారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నా.. కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో వీటిని పూర్తిచేస్తా.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై నాకు అచంచలనమైన నమ్మకం ఉందని ప్రకటించారు. ఇక, కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నా... అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేయడానికి సిద్ధమని.. అతి త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయిం తీసుకున్నానని ప్రకటన విడుదల చేశారు గండ్ర.