ఢిల్లీలో గ్యాంగ్ వార్, కాల్పుల వీడియో వైరల్

ఢిల్లీలో గ్యాంగ్ వార్, కాల్పుల వీడియో వైరల్

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సెక్టర్-11లో పట్టపగలు కొందరు దుండగులు నడిరోడ్డుపై ఒక యువకుడిపై కాల్పులు జరిపారు. అగంతకులు యువకుడిపై సినీ ఫక్కీలో రోడ్డుపై పరిగెత్తించి తుపాకీలతో కాల్చారు. రోహిణి ప్రాంతంలో జరిగిన ఈ గ్యాంగ్ వార్ కారణంగా స్థానికుల్లో భయాందోళనలు రేపాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజీలో దుండగులు ఏ విధంగా కాల్పులు జరిపింది స్పష్టంగా కనిపిస్తోంది. బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు.

శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని ఖేడా ఖుర్ద్ గ్రామంలో నివసించే మనీష్ మాన్ తన మిత్రులతో కలిసి ఎసెంట్ కారులో ఎక్కడికో వెళ్తున్నాడు. అతని కారు సెక్టర్-11 నుంచి వెళ్తుండగా ఒక కారు ఓవర్ టేక్ చేసింది. మనీష్ కారు ముందు ఆగింది. అందులో నుంచి కొందరు బయటికి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. మనీష్ కారులో తన మిత్రులను వదిలేసి కిందికి పరుగెత్తడం ప్రారంభించాడు. అప్పుడు వెంటపడిన వ్యక్తులు అతనిని కాల్చారు. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు.

ఆ తర్వాత ఆ దుండగులు నాలుగు రౌండ్లు కాల్చారు. ఈ మొత్తం సంఘటన అదే రోడ్డులో ఒక ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఏ విధంగా ఆయుధాలు ధరించిన వ్యక్తులు మనీష్ పై ఎన్నో రౌండ్లు ఫైర్ చేయడం, ఆ తర్వాత పరారు కావడం కనిపిస్తోంది. సుమారుగా 17 రౌండ్ల ఫైరింగ్ జరిగినట్టు చెబుతున్నారు. గాయపడిన యువకుడిని అంబేడ్కర్ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ కి పంపించారు. ఈ సంఘటన జరినపుడు వీధిలో ఎందరో పిల్లలు ఆడుకుంటున్నారని, కొందరు వ్యక్తులు అక్కడే ఉన్నారని తెలిసింది.