బీసీసీఐపై దాదా అసంతృప్తి..!

బీసీసీఐపై దాదా అసంతృప్తి..!

ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తారు టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు దీటైన జవాబు ఇవ్వాలన్నా ఆయనే ముందుండేవారు. టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా.. టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టిన గంగూలీ.. "భారత క్రికెట్‌లో ఇదో కొత్త ఫ్యాషన్‌.. విరుద్ద ప్రయోజనాల కింద నోటీసులు ఇవ్వడం.. వార్తల్లో నిలవడం.. ఇక ఆ భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి." అంటూ.. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ ద్రవిడ్‌కు నోటీసులు ఇవ్వడంపై ట్వీట్ చేశారు. మరోవైపు గంగూలీ ట్వీట్‌కు హర్భజన్‌సింగ్ మద్దతు తెలిపాడు.. ద్రవిడ్‌కు మించిన మరో అత్యుత్తమ క్రికెటర్‌ లేరు.. అలాంటి లెజెండ్‌కు నోటీసులు ఇవ్వడం అవమానకరం అని మండిపడ్డారు భజ్జీ. 

కాగా, రాహుల్ ద్రవిడ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌గా ఉన్నారు.. అదే సమయంలో ఇండియా సిమెంట్స్‌ సంస్థలో వైస్‌ఛైర్మన్‌గా కూడా  ఉండటంతో విరుద్ధ ప్రయోజనాల అంశంగా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు ఇచ్చింది. మరోవైపు గతంలో విరుద్ధ ప్రయోజనాల అంశం కారణంగానే ఐపీఎల్‌ మెంటార్‌ పదవిని వదులుకున్న ద్రవిడ్.. భారత జూనియర్‌ కోచ్‌ పదవికి పరిమితమైన సంగతి తెలిసిందే. మిస్టర్ క్లీన్‌గా పేరున్న రాహుల్ ద్రవిడ్‌కు నోటీసులు ఇవ్వడంపై దాదా అసంతృస్తి వ్యక్తం చేశారు. కాగా, గతంలో గంగూలీతో పాటు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు కూడా ఈ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే.