ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ..

ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ..

దేశం మాంద్యంలోకి జారిపోతోందన్న నిపుణుల హెచ్చరికలు నిజమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక మందగమనం కొనసాగుతుండటంపై ఆందోళనకరంగా మారింది. గత త్రైమాసికంగా 5.1 శాతం ఉన్న జీడీపీ.. ప్రస్తుత త్రైమాసికంలో 4.5 శాతానికి పడిపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలేవీ ఫలితాన్నివ్వడం లేదని... అసలు కేంద్రం దగ్గర మందగమనాన్ని ఎదుర్కునే వ్యూహమే లేదని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. మొదట్నుంచే మొత్తుకుంటున్నట్టే అంతా జరుగుతోందని, కేంద్రం ఇప్పటికైనా నిర్దిష్టమైన ఫలితాన్నిచ్చే చర్యలు తీసుకోవాలని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. 

రెండ్రోజుల క్రితం దేశ ఆర్థిక వ్యవస్థపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. అప్పుడు విపక్షాలు ఆందోళన చెందనక్కర్లేదన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వృద్ధిరేటు తగ్గిందే కానీ.. మాంద్యం రాలేదని, రాబోదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని, అందరూ నమ్మకం ఉంచాలని కోరారు. మన పక్కనే ఉన్న చైనా వృద్ధిరేటు కూడా తగ్గినా.. అది ఆరు శాతంగా నమోదైంది. కానీ, మన ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం ఆందోళనకర పరిణామమే అనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా తయారీ రంగం పూర్తిగా మందగించింది. ప్రభుత్వం ఎన్ని ఉద్దీపనలిచ్చినా.. ఆ రంగం కోలుకోలేదు. కోర్ రంగంగా చెప్పుకునే 8 మౌలిక సదుపాయాల సూచీల్లో ఆరు సూచీలు నేలచూపులు చూడటంతో.. జీడీపీ తగ్గిపోతోంది. విద్యుత్, బొగ్గు రంగాల సూచీలు ఏకంగా రెండంకెల స్థాయిలో దిగజారడం.. జీడీపీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కోర్ రంగం వృద్ధిరేటు దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టంగా 5.8 శాతానికి పరిమితమైంది. జీడీపీ పతనం తరుణంలో.. రిజర్వ్ బ్యాంక్ వచ్చే నెల ఐదున జరిగే పరపతి సమీక్షలో.. వడ్డీరేట్లు మరింత తగ్గించే అవకాశం ఉందంటున్నారు.