డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.6 శాతమే

డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.6 శాతమే

డిసెంబర్ 2018తో ముగిసిన మూడో త్రైమాసికంలో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు బాగా మందగించింది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ లో జీడీపీ 6.6 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సీఎస్ఓ) గురువారం ప్రకటించింది. సెప్టెంబర్ 2017తో ముగిసిన క్వార్టర్ తర్వాత ఇదే అత్యంత నెమ్మదైన జీడీపీ వృద్ధి.

గత ఏడాది ఇది 7 శాతంగా ఉంది. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 19-25 మధ్యలో రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన అంచనాలలో 55 మందికి పైగా ఆర్థికవేత్తలు భారత్ జీడీపీ వృద్ధి 6.9 శాతం ఉండొచ్చన్న అంచనాలను తలకిందులు చేస్తూ అంత కంటే తక్కువ నమోదు చేసింది.

'2018-19 ఆర్థిక సంవత్సరంలో స్థిర (2011-12) ధరల దగ్గర వాస్తవ జీడీపీ రూ.141.00 లక్ష కోట్ల స్థాయికి చేరుకోవచ్చు. జనవరి 31, 2019న ప్రకటించిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరానికి మొదట సవరించిన జీడీపీ అంచనా రూ.131.80 లక్షల కోట్లుగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతం ఉంటుందని అంచనా. 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందని' సీఎస్ఓ తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్) వృద్ధి రేట్లను 7.1 శాతం నుంచి సవరించి 7 శాతానికి తగ్గించారు. అలాగే మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిని కూడా 8.2 శాతం నుంచి సవరించి 8 శాతంగా చేశారు. 2019 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 7.2 శాతం నుంచి సవరించి 7 శాతానికి తగ్గించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో కూడా ఏప్రిల్-జూన్ 2018లో 8 శాతం నుంచి  భారీ పతనం నమోదైంది.

ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని గత నెల సీఎస్ఓ ముందుగా అంచనా వేసింది.