స్పెషల్ ఇంటర్వ్యూ: పరశురామ్ - గీత, గోవిందం పాత్రల్ని ప్రేమిస్తూ పనిచేశాను.. అందుకే ఇంత పెద్ద సక్సెస్ !

స్పెషల్ ఇంటర్వ్యూ: పరశురామ్ - గీత, గోవిందం పాత్రల్ని ప్రేమిస్తూ పనిచేశాను.. అందుకే ఇంత పెద్ద సక్సెస్ !

ఈ నెల 15వ తేదీన విడుదలై, మార్నింగ్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఘన విజయాన్ని అందుకున్న చిత్రం 'గీత గోవిందం'.  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు నటించిన ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేశారు.  సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిన సందర్బంగా పరశురామ్ తో ఎన్టీవీ జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం...    

చెప్పండి పరశురామ్ గారు.. సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?

చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను.  నా కెరీర్లోనే 'గీత గోవిందం' అతి పెద్ద సక్సెస్.  నాకు దక్కాల్సిన అసలు సిసలు విజయం ఈ సినిమాతో దక్కింది.   

'శ్రీరస్తు శుభమస్తు'కి 'గీత గోవిందం'కు మధ్యన ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది ?

అందరూ దీన్ని గ్యాప్ అనుకుంటున్నారు.  కాదు.  ఈ రెండేళ్లు నేను ఈ సినిమా కథ మీదే వర్క్ చేశాను.  స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసుకున్నాను.  నాకసలు రెండుళ్లు గడిచినట్టే లేదు.  అంతగా సినిమా కథలో ఇన్వాల్వ్ అయిపోయాను. ఈ రెండేళ్లు గీత, గోవిందం పాత్రల్ని ప్రేమిస్తూ ట్రావెల్ చేశాను.  ప్రేమిస్తూనే సినిమా చేశాను.   అందుకే ఇంత సక్సెస్ వచ్చింది.  ఇప్పటికీ అవి నా మనసులోనే ఉన్నాయి.  

మీ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కామెడీ డోస్ పెంచినట్టున్నారు ?

ఈ కామెడీ అనేది కావాలని చేసిందే కాదు.  మీరు చూసే ఉంటారు.  ఎంటర్టైన్మెంట్ మొత్తం కథలో, పాత్రల్లోనే ఉంటుంది.  నేను రాసుకున్న పాత్రల తీరును, ప్రవర్తనను బట్టే కామెడీ కంటెంట్ రాశాను.  

ముందుగా ఈ కథకు విజయ్ దేవరకొండనే అనుకున్నారా ?

అంటే.. ముందుగా వేరే కొంతమందికి కథ చెప్పాను.  అలాగే విజయ్ కి కూడ చెప్పాను.  చెప్పిన వెంటనే అతను చాలా బాగుందన్నాడు.  అలా ప్రాజెక్ట్ సెట్ అయింది. 

'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ ను ఇంత సాఫ్ట్ క్యారెక్టర్లో చూపిస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారని అనుకున్నారా ?

'అర్జున్ రెడ్డి' కంటే ముందే నేనీ కథను రాసుకున్నాను.  'పెళ్లి చూపులు' సినిమాలో విజయ్ పెర్ఫార్మెన్స్ చూసి అతనైతే బాగుంటుందని నిర్ణయించుకుని కథ చెప్పాను.  పాత్ర, కథ రెండూ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో సినిమా చేశాను. 

ఓవర్సీస్ లో కూడ సినిమా 2 మిలియన్ కలెక్ట్ చేసినట్టుంది ?

అవును.. నా గత సినిమాలేవీ ఓవర్సీస్లో ఇంత బాగా ఆడలేదు.  అక్కడ ఇదే నా మొదటి హిట్ అనుకోవచ్చు.  ఇంకా తమిళనాడు, కర్ణాటకల్లో కూడ సినిమా చాలా బాగా ఆడుతోంది. 

అసలు ఇంత పెద్ద సక్సెస్ ను ఊహించారా మీరు ?

విజయాన్నైతే ఊహించాను.  కానీ నేను అనుకున్నదానికంటే 100 రెట్లు పెద్ద  విజయాన్ని ప్రేక్షకులు నాకందించారు.  వాళ్లందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.  

మీ నిర్మాతల గురించి చెప్పండి ?

బన్నీ వాస్ గారైతే నాకు బ్రదర్ లాంటి వారు.  నేను పరాజయాల్లో ఉన్నప్పుడు నన్ను గుర్తించి, నువ్వు తప్పకుండా గొప్ప సినిమా తీయగలవు అంటూ నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ఆయన.  నిర్మాతగా ఒక సినిమాకి ఎంత సహకారం అందించాలో అంతా అందించారు.   విషయం ఏదైనా ఫైనల్ కాల్ నాకే వదిలేసేవాళ్ళు.  ఇక అల్లు అరవింద్ గారైతే కథ విన్న వెంటనే సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందని అన్నారు.  నువ్వు అందుకోవాల్సిన పెద్ద విజయాలు ముందున్నాయి అంటూ నన్ను ఎంకరేజ్ చేశారాయన. 

విజయ్ దేవరకొండతో వర్క్ చేయడం ఎలా ఉంది ? 

చాలా బాగుందండీ.  విజయ్ ఒక మంచి నటుడు.  దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉంచి పనిచేస్తాడు.  'అర్జున్ రెడ్డి' తరవాత సర్ ఇది నా  లేదు.  అయినా కథ బాగుంది.  మీ మీద   నమ్మకంతో  చేస్తున్నాను.  మీరెలా చేయమంటే అలా చేస్తాను అని పూర్తి స్వేచ్ఛను నాకొదిలేశాడు.  ఎందులోనూ తలదూర్చేవాడు కాదు.  

ఒక నటుడిగా విజయ్ ను ఎలా డిఫైన్ చేస్తారు ?

అనుమానం లేదు.. తప్పకుండా అతనొక మంచి స్టార్ అవుతాడు.  మంచి క్రమశిక్షణ ఉన్న వ్యక్తి.  కమిట్మెంట్ ఉన్న నటుడు.  

మీ హీరోయిన్ రష్మిక గురించి చెప్పండి ?

ఆమె చాలా మంచి పెర్ఫార్మర్.  సినిమాలో మీరు చూసే ఉంటారు.  ప్రతి సన్నివేశాన్ని అలవోకగా పండించేసేది.   డే అండ్ నైట్ తేడా లేకుండా ఎప్పుడు షూటింగ్ ఉన్నా వచ్చేసేది.  నిజానికి విజయ్, రష్మికల వలన నాలో ఉత్సాహం ఇంకా పెరిగి సన్నివేశాల్ని మరింత ఎంటెర్టైనింగా రాసుకున్నాను.  

ఈ సినిమాకిగాను మీకందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ?

ఒక్కరిని చెప్పలేను..  అందరూ మనస్ఫూర్తిగా అభినందించారు.  అల్లు అరవింద్ గారైతే మొదటి షో చూశాక సినిమా తప్పకుండా సూపర్ హిట్,  లైఫ్ లో ఈ అఛీవ్మెంట్ నీకు అవసరం అన్నారు.    మెగాస్టార్ చిరంజీవిగారు సినిమా చూసి నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు.  అలాగే సక్సెస్ మీట్ కూడ వచ్చారు.  ఇక బన్నీ అయితే పెద్ద సక్సెస్ పార్టీ ఇచ్చాడు.  వరుణ్ తేజ్, ధరమ్ తేజ్ ఇలా అందరూ అభినందించారు. 

మీ నెక్స్ట్ సినిమాల ప్లాన్స్ ఏంటో చెప్తారా ?

ఇప్పుడే ఏమీ అనుకోలేదు.  ఇనాక్ నా దగ్గర రెడీగా కథ కూడ లేదు.  ఎవరితో చేయాలి, ఎప్పుడు చేయాలి. ఎలాంటి సినిమా చేయాలి అనే విషయాల్ని నిర్ణయించుకోవాలి.  ఏ సినిమా చేసినా ఇంకా ఎక్కువగా కష్టపడి పనిచేయాలి అనే క్లారిటీ ఉంది.  ఎందుకంటే ఈసారి నా నుండి రాబోయే సినిమా 'గీత గోవిందం' కన్నా బాగుండాలని ప్రేక్షకులు ఆశిస్తారు కాబట్టి.