రివ్యూ : గీతా గోవిందం

రివ్యూ : గీతా గోవిందం

నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక మందన, రాహుల్, సుబ్బరాజు, నాగబాబు, గిరిబాబు తదితరులు 

మ్యూజిక్ : గోపి సుందర్ 

నిర్మాత : బన్నీవాసు 

దర్శకత్వం ; పరశురామ్ 

రిలీజ్ డేట్ : 15-08-2018

విజయ్ దేవరకొండ అనగానే అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకు వస్తుంది.  డిఫరెంట్ ఆటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు. యూత్ అంతా అర్జున్ రెడ్డి స్టైల్ కోసం పరుగులు తీశారు అంటే అర్ధం చేసుకోవచ్చు. అర్జున్ రెడ్డి విడుదలైన సంవత్సరం తరువాత.. అర్జున్ రెడ్డికి పూర్తి భిన్నమైన కాన్సెప్ట్ తో గీతా గోవిందంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  విజయ్ అంటేనే బోల్డ్ గా ఉంటాడనుకొనే యూత్ కు గీతా గోవిందం నచ్చుతుందో లేదో ఇప్పుడు చూద్దాం.  

కథ : 

సైంటిస్ట్ కావాలన్నది విజయ్ కల.  అనుకోకుండా లెక్చరర్ అవుతాడు.  చిన్నప్పటి నుంచి సంప్రదాయబద్ధంగా పెరుగుతాడు.  చాగంటి ప్రవచనాలంటే అమితమైన ఇష్టం.  ప్రవచనాల్లో చెప్పినట్టుగా చేసుకోబోయే అమ్మాయి సాంప్రదాయ బద్దంగా ఉండాలని కోరుకుంటాడు.  అలాంటి ఓ అమ్మాయి విజయ్ కు కనిపిస్తుంది.  ఆ అమ్మాయి చుట్టూ ఆరునెలలు తిరుగుతాడు.  అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లవుతుంది.  ఈ విషయం తెలిసి విజయ్ డీలా పడిపోతాడు.  ఇది జరిగిన కొన్ని రోజులకు గుడిలో రష్మిక కనిపిస్తుంది.  రశ్మికను చూసి మనసు పారేసుకుంటాడు.  ఎలాగైనా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు.  మొహమాటం, భయంతో చెప్పలేకపోతాడు.  అదేసమయంలో విజయ్ చెల్లెలు పెళ్లి కుదరడంతో.. కాకినాడకు బయలుదేరుతాడు.  అదే బస్సులో.. తన పక్కసీటులోనే రష్మిక ఉంటుంది.  భయపడుతూనే.. ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాలతో ప్రపోజ్ చేస్తాడు.  విజయ్ ప్రవర్తన నచ్చకపోవడంతో.. రష్మిక ప్రపోజ్ ను రిజక్ట్ చేస్తుంది.  ఆమె దృష్టిలో విజయ్ ఒక రోగ్ గా మిగిలిపోతాడు.  రిజక్ట్ చేసిన రష్మికను తిరిగి ఎలా ప్రొపోజ్ చేశాడు..? విజయ్ మీద పడ్డ రోగ్ మచ్చను ఎలా చెరిపేసుకున్నాడు..? రష్మిక, విజయ్ ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి ఇమేజ్ నుంచి పూర్తిగా బయటకు తీసుకురావడంలో దర్శకుడు పరశురామ్ సక్సెస్ అయ్యాడు.  భయస్తుడిగా విజయ్ నటన అద్భుతంగా ఉంది.  అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి విజయ్ పడే బాధను ఎంటర్టైనర్ గా చూపించి నవ్వులు పూయించాడు.  ఫస్ట్ హాఫ్ అంతా పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా సాగిపోతుంది.  ఆంజనేయుడు తరహా కామెడీ ఈ సినిమాలో కనిపిస్తుంది.  సినిమాల్లో కామెడీ సీన్స్ సపరేట్ గా ఉంటుంది.  ఇందులో అలా లేదు.  ఉన్న క్యారెక్టర్ల చేతనే కామెడీ సీన్స్ చేయించి సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి.  కొన్నింటిని కట్ చేసుంటే సినిమా ఇంకాస్త స్పీడ్ గా ఉండేది.  సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఎమోషన్స్ ను చూపిస్తూనే.. ఆ వెంటనే ఎంటర్టైన్మెంట్ కామెడీ ప్లే కావడంతో.. రిలీఫ్ అయినట్టుంటుంది. విజయ్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో పాటు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ లోను అద్భుతమైన నటనను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.  

నటీనటుల పనితీరు : 

విజయ్ క్యారెక్టరైజేషన్ బాగుంది.  సాంప్రదాయబద్దమైన పాత్రలో మెప్పించాడు.  అమ్మాయి చుట్టూ మేడం మేడం అంటూ తిరగడం బాగుంది.  ప్రతి సీన్ లోను ఫన్ జనరేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.  రష్మిక మరోసారి ఆకట్టుకుంది.  ఛలో సినిమాలో తానేంటో నిరూపించుకున్న రష్మిక ఈ సినిమాతో టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావడంగా కనిపిస్తుంది.  ప్రేమ, కోపం, బాధ అన్నింటిని తన పేస్ లో చక్కగా చూపించింది.  సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, నాగబాబు, గిరిబాబులు ఎవరి పాత్ర మేరకు వారు చక్కగా నటించారు.  

సాంకేతికం : 

ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు సినిమాల తరువాత పరశురామ్ చేస్తున్న సినిమా గీతా గోవిందం.  గీతా ఆర్ట్స్ బ్యానర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా.. కథను జాగ్రత్తగా డీల్ చేశాడు.  కథ పాతదే అయినప్పటికీ.. దాని చుట్టూ అల్లుకున్న కథనాలు, డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి.  గోపి సుందర్ అందించిన మ్యూజిక్ బాగుంది.  పాటలు ఆకట్టుకున్నాయి.  సినిమాటోగ్రఫీ బాగుంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథనాలు 

నటీనటులు 

విజయ్, రష్మిక 

మ్యూజిక్ 

డైలాగ్స్ 

నెగెటివ్ పాయింట్స్ : 

కథ 

స్లో నెరేషన్ 

చివరిగా : గీతా గోవిందుడు అందరికి నచ్చుతాడు..