భారత రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం

భారతదేశ రాజ్యాంగంలో సామాన్యునికి పెద్దపీట వేసేలా చొరవ చూపిన దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘోర అవమానం జరిగింది. హైదరాబాద్ పంజాగుట్టలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ డంపింగ్ లారీలో జవహర్ నగర్ కు తరలిస్తుండగా స్థానికులు, ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. డంపింగ్ యార్డ్ సమీపంలో జీహెచ్ఎంసీ లారీని అడ్డుకుని లారీలో చూడగా అంబేద్కర్ విగ్రహం బయటపడింది. దీంతో ప్రజాసంఘాల నాయకులు, దళితులు, స్థానికులు జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఇచ్చే గౌరవమిదేనా అని నిలదీశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

అంబేద్కర్ విగ్రహo ఉదంతంపై జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ స్పందించారు. దేశం గర్వించే మహోన్నతుడైన బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన దురదృష్టకర సంఘటనపై పూర్తిస్ధాయి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. గత అర్ధరాత్రి అనుమతి లేకుండా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడంతో పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారని అన్నారు. అనంతరం యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించడం జరిగిందని అన్నారు. అక్కడి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలియకుండా ఇతర ప్రాంతాలకు తరలించారని తెలిపారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం వాహనం నుంచి కిందపడి దెబ్బతిందని అన్నారు. యూసుఫ్ గూడ నుండి అంబేద్కర్ విగ్రహం బయటకు వచ్చిన సంఘటనపై ప్రాథమికంగా విచారణ జరిపామని, ఇందుకు బాధ్యులైన యూసుఫ్ గూడ యార్డ్  ఆపరేటర్ బాలాజీని విధుల నుంచి తొలగిస్తున్నట్టు కమిషనర్ దాన కిషోర్  ఒక ప్రకటనలో తెలియచేశారు.