15,660 ఇళ్లతో మెగా డబుల్ బెడ్ రూమ్ కాలనీ

15,660 ఇళ్లతో మెగా డబుల్ బెడ్ రూమ్ కాలనీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఒకటి.... అయితే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకేసారి 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తోందిజీహెచ్‌ఎంసీ. రామచంద్రపురంలోని కొల్లూరు గ్రామంలో 15,660 డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణం చేపట్టింది. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,354.59 కోట్ల వ్యయంతో మెగా డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కాలనీని నిర్మించే పనులు చురుకుగా సాగుతున్నట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ప్రతీ ఇంటిని 580 చదరపు అడుగులతో నిర్మించనున్నారు. 117 బ్లాకులుగా నిర్మాణం చేపట్టి... ఈ కాలనీ నిర్మాణ ప్రక్రియను 15 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఒక్కో డబుల్ బెడ్‌ రూమ్ నిర్మాణానికి రూ.7.90 లక్షలు వెచ్చిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఇక గృహావసరాలకు మరో రూ. 75,000 ఖర్చు చేయనున్నారు. ఇళ్లు నిర్మించి వదిలేయడం కాకుండా... అంతర్గత రహదారులు, స్మార్ట్ డ్రెయిన్ వ్యవస్థ, నీటి సరఫరా, మురికినీటి శుద్ధి కర్మాగారం, వీధి దీపాలు, వాణిజ్య సముదాయం, కమ్యూనిటీ హాల్, పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్, బస్‌స్టాప్‌, పోలీసు స్టేషన్, అగ్నిమాపక కేంద్రం, పెట్రోల్ బంక్ వంటి సౌకర్యాలను కూడా కల్పించనున్నారు.