బల్దియాలో ఆరో జోన్‌..

బల్దియాలో ఆరో జోన్‌..

జీహెచ్‌ఎంసీలో ఆరవ జోన్ త్వరలోనే ఏర్పాటు కానుంది. గ్రేటర్ బల్దియా విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్ల మేరకు ఉండటం, ప్రస్తుతమున్న 30 సర్కిళ్లలో కొన్నింటి పరిధి పెద్దగా ఉండడంతో మెరుగైన సేవలందించేందుకు  అధికారులు ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఆరో జోన్‌ ఏర్పటుకు అధికారులు పంపిన ప్రతిపాదనకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. జోన్‌ ఏర్పటుకు సంబంధించి త్వరలోనే జీవోను జారీ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాజేంద్రనగర్‌,  శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, చందానగర్‌ తదితర సర్కిళ్ల పరిధి చాలా పెద్దగా ఉండటంతో అధికారులు జోనల్, సర్కిల్ కార్యాలయాలతోపాటు ప్రధాన కార్యాలయానికి రాకపోకలు సాగించేందుకే ఎక్కువ సమయం పడుతోంది. ఆ ప్రభావం పౌరసేవల నిర్వాహణపై పడుతోంది. దీంతో.. కొత్తగా ఏర్పటయ్యే ఆరో జోన్‌లో ఇటువంటి సర్కిళ్లను చేర్చే అవకాశం ఉంది.

ఆరో జోన్ ఏర్పాటైతే ప్రస్తుతమున్న సర్కిళ్ల సంఖ్య 30 నుంచి 36 లేక 40కి పెరగనున్నట్టు సమాచారం. కొత్త జోన్‌ ఏర్పాటు సమయంలోనే జనాభా లెక్కన సర్కిళ్లను విభజిస్తామని జీవీఎంసీ అధికారి ఒకరు చెప్పారు. ఇక.. ఈ కొత్త జోన్‌తో జీహెచ్‌ఎంసీపై రూ.8 కోట్ల ఆర్థిక భారం పడనుంది. దాదాపు 75 నూతన పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది.