ప్లాస్టిక్‌ రహిత నగరమే లక్ష్యం

ప్లాస్టిక్‌ రహిత నగరమే లక్ష్యం

హైదరాబాద్‌ మహానగరంను ప్లాస్టిక్‌ రహిత నగరంగా మార్చే క్రమంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్‌ గ్లాసులు, ప్లేట్లు ఉపయోగించేలా ప్రయత్నిస్తోంది. సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ను కార్యాలయాల్లో వినియోగించవద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. మరోవైపు నగరంలో చిన్న ఫంక్షన్, వివాహాలు, విందులు లాంటి వేడకల్లోనూ సింగిల్‌ యూజ్ ప్లాస్టిక్‌ వినియోగించకుండా నియంత్రించేలా కసరత్తులు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో 4వేలకు పైగా ఫంక్షన్‌ హాళ్లు మరియు వేళ సంఖ్యలో హోటల్స్ ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ లో ఒకే రోజు వేళ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఈ వేడుకలలో వాడే ప్లేట్లు, గ్లాసులు, స్వీట్‌, ఐస్‌ క్రీం కప్పులు, స్పూన్‌లు అన్నీ ప్లాస్టిక్‌వే ఉంటాయి. ఇంతలా ప్లాస్టిక్ ఉపయోగించడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని హోటల్స్, ఫంక్షన్‌ హాళ్లలో ప్లాస్టిక్‌ వస్తువులు వాడకుండా.. వాటి బదులు స్టీల్‌ గ్లాసులు, ప్లేట్లు ఉపయోగించేలా ఫంక్షన్‌ హాళ్లు, హోటల్స్ యజమానులను ఒప్పించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు.

తమ సర్కిళ్ల పరిధిలో ఉన్న హోటల్స్, ఫంక్షన్‌ హాళ్లను డీఎంసీలు, ఏఎంఓహెచ్‌లు, ప్రాజెక్టు ఆఫీసర్లు దత్తత తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. పెళ్లిళ్ల సీజన్ మళ్ళీ మొదలవనున్న నేపథ్యంలో వెంటనే అధికారులు రంగంలోకి దిగాలని సూచించారు. ప్లాస్టిక్‌ రహిత హైదరాబాద్‌ రూపకల్పనలో ప్రతి  ఒక్కరూ భాగమవ్వాలని కోరారు. మరోవైపు హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లలో వ్యర్ధాలకు కంపోస్ట్‌ పిట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాజాగా జీహెచ్‌ఎంసీ సమావేశంలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల వినియోగంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా మండిప్పడ్డారు. మంత్రి కేటీఆర్‌ అదేశాల మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్లాస్టిక్‌ వాడరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సంస్థ కార్యాలయాల్లో ఇక మీదట ప్లాస్టిక్‌ వినియోగించవద్దని వాటర్‌ బోర్డు ఎండీ ఎం.దాన కిషోర్‌ నిర్ణయం తీసుకున్నారు.