వరంగల్‌లో మరో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత..

వరంగల్‌లో మరో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత..

వరంగల్‌లో మరో దారుణమైన ఘటన జరిగింది.. హన్మకొండలోని సమ్మయ్యనగర్‌లో తనపై అత్యాచారం చేశారనే అవమానభారంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మాయమాటలు చెప్పి తమవెంట తీసుకెళ్లిన స్నేహితులే బాలికపై అత్యాచారం చేశారు. దీంతో బాలిక తీవమనోవేదనకు గురైంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే సమ్మయ్యనగర్‌కు చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. శుక్రవారం సాయంత్రం స్కూల్‌ నుంచి తిరిగివస్తున్న సమయంలో విద్యార్థినిని పెంబర్తి తీసుకెళ్లారు.. అందులో ఇద్దరు బాలిక స్నేహితులే ఉండడంతో వారివెంట వెళ్లింది. చివరికి వాళ్లే ఆ అమ్మాయిపాలిట మృగాళ్లుగా మారారు. ఎవరూలేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో మానసికంగా కృంగిపోయిన బాలిక.. తనకు జరిగిన అవమానాన్ని తన నాన్నమ్మకు చెప్పుకొని ఏడ్చింది. రెండు రోజుల తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. అయితే, ఆ దుర్మార్గులు తనకు ఏదో ఇంజక్షన్ ఇచ్చి తనపై అత్యాచారం చేశారని.. ఎప్పటికైనా వాళ్లు నన్ను చంపేస్తారు.. వాళ్లను మాత్రం విడిచిపెట్టొద్దని తమకు చెప్పిందని బంధువులు గుర్తుచేసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.