కెప్టెన్లుగా మాక్స్‌వెల్, వేడ్...

కెప్టెన్లుగా మాక్స్‌వెల్, వేడ్...

ఆస్ట్రేలియా క్రికెటర్లు గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్‌లు కెప్లెన్లుగా నియమితులయ్యారు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) ఎనిమిదవ సీజన్ కు ఇద్దరు కెప్లెన్లుగా వ్యవహరించనున్నారు. మెల్‌బోర్న్ స్టార్స్ టీమ్‌కు  మాక్స్‌వెల్.. హోబార్ట్ హరికేన్స్ జట్టుకు వేడ్ కెప్లెన్లుగా నియమితులయ్యారు. మెల్‌బోర్న్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న జాన్ హేస్టింగ్ అనారోగ్య కారణంగా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతని స్థానంలో మాక్స్‌వెల్ వచ్చాడు. గత సీజన్ లో సెంచరీ చేయడం.. సౌతాఫ్రికా, ఇండియాలపై మంచి ప్రదర్శన చేయడంతో మాక్సీకి కెప్టెన్ అవకాశం వచ్చింది. 'మెల్‌బోర్న్ టీమ్ కెప్టెన్‌గా ఎంపికైనందుకు గర్వంగా  ఉంది. వచ్చే సీజన్‌ను గొప్పగా ముగించేందుకు నా వంతు కృషి చేస్తా. హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. కొందరు కొత్త వాళ్ళు కూడా ఉండటంతో.. అందరం కలిసిపోవాలి' అని మాక్స్‌వెల్ తెలిపాడు.

హోబార్ట్ హరికేన్స్ జట్టు కెప్టెన్ జార్జ్ బెయిలీ స్థానంలో మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 'మంచి టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నా. జార్జ్ నుండి కెప్టెన్‌ బాధ్యతలు అందుకోవడం సంతోషంగా ఉంది. ఇక జార్జ్ బ్యాటింగ్ పైనే దృష్టి పెడతాడు.. ఇది మాకు కలిసి వచ్చేదే' అని వేడ్ తెలిపాడు. బిగ్‌బాష్ లీగ్ డిసెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది.