కుప్పకూలిన మార్కెట్లు

కుప్పకూలిన మార్కెట్లు

చైనా వ‌స్తువుల‌పై ల‌క్షల కోట్ల డాల‌ర్ల సుంకాల‌ను వేస్తున్న‌ట్లు అమెరికా ప్ర‌క‌టించ‌డంతో అంత‌ర్జాతీయంగా షేర్ మార్కెట్లు కుప్ప‌కూలాయి. చైనా మార్కెట్లు ఏకంగా 5 శాతంపైగా క్షీణించ‌డంతో ఇన్వెస్ట‌ర్లు కంగుతిన్నారు. సుమారు 20వేల కోట్ల డాల‌ర్ల చైనా వ‌స్తువుల‌పై సుంకాన్ని 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్న‌ట్లు ట్రంప్ ట్వీట్ చేయ‌డంతో ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లో అమ్మ‌కాలు వెల్లువెత్తాయి. జ‌పాన్ మార్కెట్ల‌కు సెల‌వు. చైనా షాంఘై సూచీ 5.5 శాతం చైనా ఏ50 సూచి ఆరు శాతంమేర‌కు క్షీణించాయి. హాంగ్‌సెంగ్ కూడా ఏకంగా 3.5 శాతం న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి. న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా, కొరియా, సింగ‌పూర్‌, తైవాన్‌... ఒక‌టేమిటి.. మొత్తం ఆసియా మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. అంత‌ర్జాతీయ క‌రెన్సీ మార్కెట్ల‌లో డాల‌ర్ నిల‌క‌డ‌గా ఉండ‌టం కాస్త మెరుగు. డాల‌ర్ ఏమాత్రం పెరిగినా... ప‌త‌నం మ‌రింత ఉంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. అమెరికా, చైనా మ‌ధ్య చ‌ర్చ‌లు ఈ బుధ‌వారం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ చ‌ర్చ‌లు సానుకూలంగా జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు రావ‌డంతో... మార్క‌ట్లు ఈ వారం పెరుగుతాయ‌నే అంచనాతో ఇన్వెస్ట‌ర్లు ఉన్నారు. ట్రంప్ ట్వీట్‌తో  ఒక్క‌సారిగా మార్కెట్లు భారీ ప‌త‌నం అవుతున్నాయి. అమెరికా ఫ్యూచ‌ర్స్ మార్కెట్లు కూడా ఏకంగా రెండు శాతంపైగా న‌ష్టంతో ట్రేడ‌వుతుండ‌టంతో... మ‌ధ్యాహ్నం యూరో మార్కెట్ల‌లో అమ్మ‌కాల వెల్లువ త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు.