భోగాపురం ఎయిర్ పోర్ట్ బిడ్ నెగ్గిన జీఎంఆర్

భోగాపురం ఎయిర్ పోర్ట్ బిడ్ నెగ్గిన జీఎంఆర్

ఆంధ్రప్రదేశ్ లోని గ్రీన్ ఫీల్డ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ బిడ్ ను ఎయిర్ పోర్ట్స్, మౌలిక వసతుల సంస్థ జీఎంఆర్ గెలుచుకుంది. గత ఏడాది జూలైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించిన బిడ్లలో జీఎంఆర్ అత్యధిక బిడ్డర్ గా నిలిచింది. 

ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఆంధ్ర ప్రదేశ్ ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీఎల్)కి చెందిన అధికారులు భోగాపురం ఎయిర్ పోర్ట్ ఆర్థిక బిడ్లను సోమవారం తెరిచారు. వీటిలో జీఎంఆర్ ప్రతి ప్రయాణికుడిపై రూ.303.00 ఫీజు ఇస్తామన్న జీఎంఆర్ ఆఫర్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. పోటీలో నిలిచిన మిగతా రెండు కంపెనీలు, డూఇట్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జీవీకే వరుసగా రూ.261, రూ.207 పర్ ప్యాసింజర్ ప్రభుత్వానికి ఇస్తామని చెప్పాయి. అంటే ఏడాదికి విమానాశ్రయం నుంచి 5 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిస్తే ఎయిర్ పోర్ట్ డెవలపర్ ప్రభుత్వానికి రూ.303.00 పర్ ప్యాసింజర్ చొప్పున ఆ ఏడాదికి రూ.150 కోట్లు చెల్లిస్తుంది. 

బిడ్డింగ్ ప్రక్రియ ఫలితాన్ని ఇంధనం, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ధ్రువీకరించారు. ప్రాజెక్ట్ ని మూడేళ్లలో డెవలపర్ కంపెనీ నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారుగా రూ.2,700 కోట్లు వ్యయం అవుతుందన్నారు.

ఎమ్మార్వో సౌకర్యం వంటి అదనపు హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బిడ్లను ఆహ్వానించింది. అంతకు ముందు టెండర్ లో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మాత్రమే ఎల్1గా ఉంది.