ముస్లిం కుటుంబంపై విచక్షణారహితంగా దాడి

 ముస్లిం కుటుంబంపై విచక్షణారహితంగా దాడి

హర్యానాలోని గుర్గావ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ముస్లిం కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఇనుపరాడ్లు, క్రికెట్ బ్యాట్స్, వాటర్ పైప్స్ తో స్వైరవిహారం చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లోని భోండ్సిలో ఉన్న భూప్‌సింగ్ నగర్‌లో హోలీ రోజున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహమ్మద్ సాజిద్ అనే వ్యక్తి తన భార్య సమీనా, ఆరుగురు సంతానంతో కలిసి భూప్ సింగ్ నగర్ లో నివసిస్తున్నారు. సాజిద్ కుటుంబ సభ్యులు ఇంటి ముందున్న వీధిలో క్రికెట్ ఆడుతుండగా.. కొంతమంది యువకులు అందుకు అభ్యంతరం చెప్పారు. వీధిలో క్రికెట్ ఆడవద్దన్నారు. పాకిస్థాన్ వెళ్లి క్రికెట్ ఆడుకోవాలంటూ.. దాదాపు 40మంది యువకులు వారి ఇంటి పైకి వచ్చి దాడికి పాల్పడ్డారు. ఆ ఇంటి మహిళ దాడి చేయవద్దంటూ వేడుకున్నా.. వారు కనికరించలేదు. దాడిలో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి తల పగిలి తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయాడు. దాడిలో గాయపడ్డ మరో వ్యక్తి చలనం లేకుండా ఓ మూలకు పడిపోయాడు. అయినప్పటికీ ఆ మూక అతనిపై దాడి ఆపలేదు.

సాజిద్ బంధువు దిల్ షాద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీధిలో క్రికెట్ ఆడే విషయంపై తలెత్తిన వివాదమే దాడికి కారణమైందని బాధిత కుటుంబం చెబుతోంది. దాడికి పాల్పడినవారిలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా మరికొంతమంది నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు భోండ్సి పోలీస్ స్టేషన్ అధికారి సురేంద్ర కుమార్ తెలిపారు. వీరిపై ఐపీసీ 148, 149, 307, 323, 427, 452, 506 సెక్షన్ల కింద కేసు నమోదైందని అన్నారు. మరోవైపు బాధిత కుటుంబం మాత్రం ఇది కొంతమంది హిందుత్వ వాదులు చేసిన దాడి అని ఆరోపిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో దాదాపు 10 మంది వ్యక్తులు సదరు ముస్లిం కుటుంబంపై దాడి చేయడం కనిపిస్తోంది.