బీజేపీకి జీఎఫ్‌పీ రాంరాం..

బీజేపీకి జీఎఫ్‌పీ రాంరాం..

ఓవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో అధికార మార్పిడికి భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంటే... బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో మాత్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది మిత్రపక్షమైన గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్‌పీ). సీఎం ప్రమోద్ సావంత్ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకున్నట్టు జీఎఫ్‌పీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్ ప్రకటించారు. ఈ విషయాన్ని గవర్నర్‌కు లేఖ ద్వారా తెలిపినట్టు వెల్లడించారు. ఇవాళ సమావేశమైన జీఎఫ్‌పీ రాజకీయ వ్యవహారాల కమిటీ, శాసనసభా పక్షం.. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాగా, తాజాగా జరిగిన గోవా కేబినెట్ విస్తరణలో జీఎఫ్‌పీకి షాక్ ఇచ్చింది బీజేపీ. డిప్యూటీ సీఎంగా ఉన్న సర్దేశాయ్‌తో పాటు ముగ్గురు జీఎఫ్‌పీ నేతలను, మంత్రిగా ఉన్న మరో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేను కేబినెట్‌ నుంచి తొలగించారు. అయితే, ఆ స్థానాల్లో కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ముగ్గురికి చోటు కల్పించారు. సర్దేశాయ్ స్థానే కవ్లేకర్‌ను డిప్యూటీ సీఎంగా నియమించారు. దాంతో పాటు మరో బీజేపీ ఎమ్మెల్యేని కూడా కేబినెట్‌లోకి తీసుకున్నారు. గోవా సీఎం నిర్ణయంపై గుర్రుగా ఉన్న జీఎఫ్‌పీ.. ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి రాంరాం చెప్పేసింది.