మొదలయిన బోటు వెలికితీత పనులు

మొదలయిన బోటు వెలికితీత పనులు

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి.  బోటు వెలికితీత పనులను నిన్న ప్రభుత్వం కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్‌ సంస్థకు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలాజీ మెరైన్‌ సంస్థ యజమాని ధర్మాడి సత్యం బృందం రోప్‌, లంగర్లతో ఘటనా స్థలానికి బయలుదేరారు. దేవీపట్నం పోలీస్‌ స్టేషన్‌ నుంచి భారీగా వెలికితీత సామగ్రిని ప్రమాద ప్రాంతానికి ప్రత్యేక బోటులో తరలిస్తున్నారు.

అయితే ఇప్పటికే 144 సెక్షన్‌ ఉండగా బోటు వెలికితీసే సమయంలో పనులకి అడ్డం తగిలేలాగా ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ధర్మాడి సత్యం నేతృత్వంలో 25 మంది మత్స్యకారులు, నిపుణులు వెలికితీతలో పాల్గొన్నారు. క్రేన్‌, ప్రొక్లెయిన్‌, బోటు, పంటు, 800 మీటర్ల వైర్‌ రోప్‌, రెండు లంగర్లు, మూడు లైలాండ్‌ రోప్‌లు, పది జాకీలు, ఇతర సామగ్రి ఉపయోగిస్తున్నారు. అయితే నదిలోకి దిగకుండానే బోటు, పంటు మీద నుండి లంగర్లను నదిలోకి వదులుతారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో వీటిని వదిలి బోటు కోసం గాలింపు చర్యలు చేపడతారు. లంగరుకు బోటు తగిలిన వెంటనే ఆ రోప్ కు క్రేన్ ను అనుసంధానం చేసి బయటకు లాగేందుకు ప్రయత్నిస్తారు. బోటు 210 అడుగుల లోతులో ఉండటం వల్ల అక్కడికి ఎవరూ వెళ్లలేరని, ఇప్పటికే బోటు ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని, వెలికితీత అత్యంత కష్టమైనా పలుసార్లు ప్రయత్నిస్తామని చెబుతున్నారు. బోటును వెలికితీస్తే గల్లంతయిన వారి మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తున్నందున మృతదేహాలు గుర్తుపట్టే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు.