బంగారం ధర భగభగ... ఇక ఆపడం కష్టమేనా..?

బంగారం ధర భగభగ... ఇక ఆపడం కష్టమేనా..?

బంగారం ధర భగభగా మండుతోంది... ఆల్‌టైం హై రికార్డులు సృష్టించి దిగివచ్చినట్టే కనిపించిన పసిడి ధర మళ్లీ ఎగసిపడుతోంది... తాజాగా ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న పరిణామాలు, అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనం కావడంతో ఆకాశాన్ని అంటుంతోంది. ధర చుక్కల్లోకి చేరింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నడుమ బంగారం మెరిసిపోయింది. అలాగే దేశీ మార్కెట్‌లో డిమాండ్ పుంజుకోవడంతో పసిడి దూకుడుకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. గత పది రోజుల్లోనే 10 గ్రాముల పసిడిపై రూ. 1,410 పెరగగా... నిన్న ఒక్కరోజే రూ.660 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 41,380కి చేరింది. ఇక, నిన్న రూ.610కి పెరిగి 22 క్యారెట్స్ బంగారం రూ.37,930గా పలకగా.. ఈ రోజు మరింతి ఎగబాకింది. 

శనివారం రూ.390 పెరగడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.41,770కి పరుగులు పెట్టింది... 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.390 పెరగడంతో ఇవాళ 10 గ్రాముల ధర రూ.38,320కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా పైపైకి వెళ్తోంది.. శనివారం రోజు కిలో వెండి ధర రూ.200 పెరగడంతో రూ.49,600కు చేరింది. అంతర్జాతీయంగా పరిణామాలు ఇలాగే కొనసాగితే తప్ప పసిడి ధర దిగిరావడం కష్టమంటున్నారు విశ్లేషకులు.