పైపైకి బంగారం ధర.. కిందికి దిగదా..?

పైపైకి బంగారం ధర.. కిందికి దిగదా..?

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింతగా పెరిగాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ తగ్గడం వంటి అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. బుధవారం న్యూఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.485 పెరిగి రూ.41,810కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.855 పెరిగి రూ.49,530కి ఎగబాకింది. ముంబై బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.314 పెరిగి రూ.40,851కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.650 పెరిగి రూ.47,795కు చేరింది.

రూపాయి బలహీనత కూడా తోడవడంతో.. బంగారం ధర పెరిగిపోతోంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో మదుపర్లు బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,584 డాలర్లు, వెండి ధర 18.43 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నాయి. ఖుద్స్ ఫోర్స్ కమాండర్ సులేమానీ హత్య జరిగిన రోజు నుంచీ బంగారం ధర పెరుగుతూనే ఉంది.