ఏప్రిల్ లో 54 శాతం పెరిగిన బంగారం దిగుమతులు

ఏప్రిల్ లో 54 శాతం పెరిగిన బంగారం దిగుమతులు

ఏప్రిల్ నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే పసిడి దిగుమతులు 54 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ దిగుమతుల విలువ 3.97 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.27685 కోట్లు)గా అంచనా వేశారు. దీంతో దేశ వాణిజ్య లోటు మరింత పెరిగింది. వాణిజ్య లోటు పెరగడంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్(సీఏడీ)పై ఆందోళన వ్యక్తమవుతోంది. 

బంగారం దిగుమతుల్లో పెరుగుదల కారణంగా దేశ వాణిజ్య లోటు ఏప్రిల్ నెలలో ఐదు నెలల గరిష్ఠ స్థాయి 15.33 బిలియన్ డాలర్లకు చేరింది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సీఏడీ మరింత పెరిగి 2.5 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది 2.1 శాతంగా ఉంది. విదేశీ మారకద్రవ్యం ఔట్ ఫ్లో, ఇన్ ఫ్లోల మధ్య వ్యత్యాసమే సీఏడీ. 

ఫిబ్రవరిలో దిగుమతుల పెరుగుదల తిరోగమన బాట నమోదు చేశాయి. కానీ బంగారం దిగుమతులు మాత్రం రెండంకెల వృద్ధిని చూశాయి. మార్చిలో ఇది 31 శాతం పెరిగి 3.27 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ వివరాల మేరకు ఏప్రిల్ 2018లో బంగారం దిగుమతులు 2.58 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.