బంగారంః మ‌నం అమ్ముతున్నాం.. చైనా కొంటోంది

బంగారంః మ‌నం అమ్ముతున్నాం.. చైనా కొంటోంది

బులియ‌న్ విష‌యంలో గ‌త కొన్ని వారాలుగా భార‌త్, చైనా మార్కెట్లు భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాయి. ముఖ్యంగా గ‌త‌వారంలో భార‌త మార్కెట్లో బంగారం ధ‌ర భారీగా త‌గ్గుతూ వ‌చ్చింది.ఆరంభంలో కాస్త పెరిగిన‌ట్లు క‌నిపించినా.. అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది. ఇటీవ‌ల ముంబైలో జ‌రిగిన అంత‌ర్జాతీయ న‌గ‌ల ఎగ్జిబిష‌న్ కోసం కొంత మంది వ‌ర్త‌కులు భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. అపుడు కాస్త పెరిగినా.. అంత‌ర్జాతీయంగా డాల‌ర్ మార‌కం విలువ బాగా పెర‌గ‌డంతో బంగారం ధ‌ర త‌గ్గింది. దీంతో ఎగ్జిబిష‌న్ లో కూడా వ్యాపార‌స్తులు అంత‌ర్జాతీయ మార్కెట్‌కు ఒక‌టి నుంచి రెండు డాల‌ర్ల వ‌ర‌కు (ఔన్స్‌) డిస్కౌంట్ తో బంగారం అమ్మారు. గ‌త మార‌వారంలో బంగారం జ‌న‌వ‌రి నెల క‌నిష్ఠ స్థాయికి ప‌డిపోయింది. ముఖ్యంగా ఫ్యూచర్స్ మార్కెట్‌లోబంగారం ధ‌ర త‌గ్గ‌డం ఆందోళన క‌ల్గిస్తోంది. స్పాట్ మార్కెట్ తో పోలిస్తే  ఫ్యూచ‌ర్స్ లో ముఖ్యంగా సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ నెల ఫ్యూచ‌ర్స్ కూడా డిస్కౌంట్ తో ట్రేడవుతున్నాయి. దీన‌ర్థం మున్ముందు కూడా భారీ అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తుందని, బంగారం ధ‌ర‌లు ఇంకా త‌గ్గుతాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. దీంతో చాలా మంది తాజాగా బంగారం కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. కొంద‌రైతే డిస్కౌంట్ తో బంగారాన్నివొదిలించుకుంటున్నారు.
చైనాలో భిన్నం
చైనా మార్కెట్లో మాత్రం దీనికి భిన్నంగా జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం కూడా బంగారం కొనుగోళ్ళ‌ను ప్రోత్స‌హిస్తోంది. పైగా డాల‌ర్ తో పోలిస్తే చైనా క‌రెన్సీ యువాన్ విలువ పెర‌గింది. అంటే త‌క్కువ ధ‌ర‌కు బంగారం ల‌భిస్తోంది. మ‌న‌దేశంలో మ‌న క‌రెన్సీ బ‌ల‌హీన ప‌డ‌టంతో బంగారం విలువ ఎక్కువ‌గా ఉంటుంది. కాని చైనాలో ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌టంతో పాటు చైనా, అమెరికా మ‌ధ్య మొద‌లైన వాణిజ్య ఆంక్ష‌ల నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త‌గా అక్క‌డి ప్ర‌జ‌లు బంగారంలో పెట్టుబ‌డి పెంచుతున్నారు. స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడుదుడుకుల‌కు లోను కావ‌డంతో బులియ‌న్ ఆక‌ర్షీణీయంగా మారింది. పైగా బంగారం అంత‌ర్జాతీయ మార్కెట్లో 1200 డాల‌ర్లు (ఔన్స్‌) గ‌ట్టి స‌పోర్ట్ ఉంద‌ని.. ఇంత‌కంటే త‌గ్గ‌ద‌ని చైనా ఇన్వెస్ట‌ర్లు భావిస్తున్నారు.