బంగారంలో మదుపరులకు మంచికాలమే

బంగారంలో మదుపరులకు మంచికాలమే

వచ్చే ఏడాది బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మదుపరులకు మంచి ఫలితాలిచ్చే పెట్టుబడి బంగారమే అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా లోటు బడ్జెట్ దిశగా పరుగులు తీస్తూ ఉండడం, రెండు అగ్ర దేశల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతూ ఉండడం వంటి అంశాల కారణంగా బంగారం ధరలు భారీగా పెరగొచ్చని మార్కెట్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 
కార్పొరేట్ ట్యాక్సుల్లో సంస్కరణల ఫలితంగా అమెరికా ఆర్థిక పరిస్థితి అదుపు తప్పి..  బులియన్ ధరలకు రెక్కలొచ్చే అవకాశాలున్నాయంటున్నారు. 2019లో ఔన్స్ బంగారం ధర 1350 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.  

సోమవారం ఔన్స్ బంగారం ధర 1198.82 డాలర్లు పలికింది. ఈ సంవత్సరం సగటు ధర 1285 డాలర్లుగా నమోదైంది. భారీగా పెరుగుతున్న ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు అమెరికా కరెన్సీ ప్రింట్ చేయాల్సి వస్తుందని.. మరోవైపు అమెరికా ఆర్థిక పరిస్థితి గత రెండేళ్ల కన్నా దిగజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నందున్న డాలర్ విలువ పడిపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దీనివల్ల అమెరికా ద్రవ్యలోటుపై ఆందోళనలున్నా.. బంగారం లాంగ్ రన్లో పాజిటివ్ ఫలితాలిస్తుందని అభిప్రాయపడుతున్నారు. 

అయితే భారత కరెన్సీ విలువ గణనీయంగా పడిపోతున్న దరిమిలా... అంతర్జాతీయ ధరలతో పోలిస్తే మన దేశ మదుపరులకు తక్కువ లాభాలు వస్తాయని చెబుతున్నారు. మొత్తానికి మినిమమ్ గ్యారెంటీతో పాటు అదనంగా వచ్చే బోనస్ ఆశించే స్థాయిలో ఉండకపోయినా ఫరవా లేదనిపించే రీతిలో ఉంటుందని చెబుతున్నారు.