పసిడి పరుగులు..! రూ.40 వేల నుంచి రూ.42 వేల వైపు..!
బంగారం ధరలు కొండెక్కనున్నాయా.. ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న అతి విలువైన లోహాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పతనమవడం, స్టాక్ మార్కెట్లు అంతంత స్థాయిలో రిటర్నులు పంచడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారంపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడంతో ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. వీటికి తోడు పలు దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితి నెలకొనడం, సెంట్రల్ బ్యాంకులు అత్యధికంగా కొనుగోళ్లు జరపడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడటంతో బంగారం మరింత మిలమిలమెరువబోతున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 40 వేల స్థాయిలో ఉన్న పసిడి ధరలు మరో రెండు నెలలు అంటే ఈ ఏడాది చివరినాటికి 42 వేల మార్క్‌కు చేరుకోనున్నాయంటున్నారు.
గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలతో సామాన్యుడికి అందనంత దూరంలోకి పసిడి చేరుకుంది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల ధర 39 వేల 840 రూపాయలుగా ఉంది. ఈక్విటీ మార్కెట్ల కంటే బంగారం, భూములపై పెట్టుబడులు పెట్టిన వారికి రిటర్నులు అధికంగా లభిస్తుండటంతో గతేడాది కాలంగా వీటివైపు మొగ్గుచూపేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)