భారీగా పెరిగిన పసిడి ధర.. ఏడేళ్ల గరిష్టానికి ఎగబాకింది..!

భారీగా పెరిగిన పసిడి ధర.. ఏడేళ్ల గరిష్టానికి ఎగబాకింది..!

పసిడి ధరకు పగ్గాలే లేకుండా పరుగులు పెడుతోంది.. నానాటికీ పెరుగుతూ.. ఆకాశాన్ని తాకుతోంది. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం ఇవన్నీ పసిడి ధరను పెంచేశాయి. దీనికి తోడు కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అన్ని ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపరులు బంగారంలో మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధర కొండెక్కి కూర్చొంటోంది. సోమవారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.47,865కు చేరింది. ఇక వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో వెండి 3శాతం పెరిగి రూ.48,208 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగానూ పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. సోమవారం ఏకంగా 1శాతం పెరిగిన బంగారం ధర ఔన్సు 17 వందల 60 డాలర్లకు పెరిగింది. 2012, అక్టోబరు 12 తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా మధ్య ఘర్షణ వాతావరణానికి తోడు.. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటం, అమెరికా, జపాన్ దేశాల బలహీన ఎకనమిక్ డేటా తదితరాలు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు చూసేందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు.