పరుగులు పెడుతోన్న పసిడి ధర..

పరుగులు పెడుతోన్న పసిడి ధర..

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైపైకి ఎగబాగుతుండడంతో.. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. రోజుకు కొంత మొత్తం చొప్పున పెరుగుతూ కొత్త రికార్డుల వైపు పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది. శుక్రవారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరిగి రూ.35,950కి చేరుకుంది. ఇక పసిడితో వెండి కూడా పోటీ పడుతోంది. ఒకే రోజులో రూ.935 పెరగడంతో కిలో వెండి ధర రూ.42,035కు చేరుకుంది. వరుసగా నాలుగు రోజుల నుంచి వెండి పైపైకి ఎగబాకుతోంది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడమే వెండి ధరలకు కారణం అంటున్నారు. మరోవైపు బంగారం వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలు మరింత పెరుగుతున్నట్టు అఖిల భారత సరాఫా అసోసియేషన్‌ ప్రకటించింది. మరోవైపు ముంబై బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.305 పెరిగి రూ.35,198కు చేరుకుంది. ఇక, కిలో వెండి ధర రూ.545 పెరిగి రూ.40,585కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ను పరిశీలిస్తే ఔన్స్‌ స్పాట్‌ బంగారం ధర 1,440-1,452.95 డాలర్ల స్థాయిలో కదలాడింది. డాలర్‌ బలహీనత నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.