అక్షయ తృతీయ ఎఫెక్ట్‌తో పసిడి ధర పైపైకి...!

అక్షయ తృతీయ ఎఫెక్ట్‌తో పసిడి ధర పైపైకి...!
అక్షయ తృతీయ సమీపిస్తోంది... ఈ నెల 18వ తేదీన అక్షయ తృతీయ రానుంది... అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం.. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులు కొనడం సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. చేతిలో డబ్బు లేకున్నా అప్పోసొప్పో చేసి మరీ విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దీంతో ఈ సమయంలో పసిడి ధర పైపైకి పోతోంది. అక్షత తృతీయ దృష్ట్యా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెంచడంతో గత వారంలోనే పెరుగుతూ వచ్చిన పసిడి ధర... 10 గ్రాముల 24 క్యారెట్ల ధర ఏకంగా 32 వేల మార్కును దాటింది. అయితే ఈ రెండు రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అక్షయ తృతీయకు తోడు వరుసగా పెళ్లిళ్లు ఉండటంతో బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. మరో వైపు అమెరికా-చైనా ట్రేడ్ వార్ కొనసాగే పరిస్థితులుండటంతో బంగారం కొనేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. రెండేళ్ల క్రితం అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల పసిడి ధర రూ.29,860గా పలికితే... ఈసారి మాత్రం బంగారం ధరలు అక్షయ తృతీయకు ముందే పైపైకి పోతున్నాయి. గత వారమే రూ.32 వేల మార్క్‌ను దాటిన బంగారం ధర... మరి అక్షయ తృతీయ సమీపిస్తుండడంతో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక ఇదే సందర్భంలో బంగారం కొనుగోళ్లపై ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి పలు షాపులు. ప్రజల్లో ఉన్న అక్షయ తృతీయ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు బంగారం కొనుగోళ్లు 15 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.