తగ్గిన బంగారం, వెండి ధరలు

తగ్గిన బంగారం, వెండి ధరలు

బుధవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రోజువారీ లావాదేవీలు ముగిసే సమయానికి బంగారం రూ.25 తగ్గి 10 గ్రాములకు రూ.34,450 దగ్గర ముగిసింది. బులియన్ మార్కెట్లో స్థానిక జువెలర్స్ నుంచి డిమాండ్ తగ్గినందువల్లే బంగారం ధరలు తగ్గాయని ఆలిండియా సరాఫా అసోసియేషన్ వివరించింది. 

బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా బాగా పతనమయ్యాయి. ఇవాళ్టి లావాదేవీల్లో వెండి రూ.320 మేరకు పతనమై కిలో వెండి రూ.41,380 దగ్గర ముగిసింది. పారిశ్రామిక సంస్థలు, నాణేల ఉత్పత్తిదారుల నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో వెండి ధరలు పతనమైనట్టు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బలహీన సూచనల మధ్య స్థానిక జువెలర్స్ నుంచి డిమాండ్ లేనందువల్ల బంగారు, వెండి ధరలు తగ్గుముఖం పట్టినట్టు ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే న్యూయార్క్ లో బంగారం పతనమై ఔన్స్ 1,313.58 డాలర్లు, వెండి ధరలు తగ్గి ఔన్స్ 15.75 స్థాయిలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9%, 99.5% శుద్ధమైన బంగారం రూ.25 తగ్గి 10 గ్రాములకు వరుసగా రూ.34,450, రూ.34,400 స్థాయిలో నిలిచాయి. సావరిన్ బంగారం నిలకడగా 8 గ్రాములకు రూ.26,100 దగ్గర ఉంది. శుద్ధమైన వెండి రూ.320 తగ్గి కిలో రూ.41,380, వీక్లీ బేస్డ్ డెలివరీలో రూ.322 తగ్గుదలతో రూ.40,323 కిలో స్థాయిలో ముగిశాయి. మరోవైపు సిల్వర్ కాయిన్స్ కూడా ఫ్లాట్ గా ఉన్నాయి. 100 కాయిన్స్ రూ.80,000 కొనుగోలు, రూ.81,000 అమ్మకం దగ్గర కొనసాగాయి.