రివ్యూ: గూఢచారి

రివ్యూ: గూఢచారి

నటీనటులు : అడివి శేష్, శోభిత ధూళిపాళ

మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల

ఫోటోగ్రఫి : శానియల్ డియో

నిర్మాత : అభిషేక్ పిక్చర్స్

దర్శకత్వం : శశి కిరణ్ తిక్క

రిలీజ్ డేట్ : 03-08-2018

అడివి శేష్, శోభిత ధూళిపాళ హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ తిక్క రూపొందించిన చిత్రం 'గూఢచారి'.  అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.  ఆరంభం నుండి చేసిన భారీ ప్రమోషన్ల కారణంగా సినిమాకు మంచి హైప్ లభించింది.  మరి ఈ స్పై థ్రిల్లర్ ఏ లెవల్లో అలరించిందో ఇప్పుడు చూద్దాం.. 

కథ: 

టెర్రరిస్టుల బృందం చేత చంపబడిన జాతీయ భద్రతా విభాగానికి చెందిన అధికారి కుమారుడు అర్జున్(అడివి శేష్).  తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న అర్జున్ అనేక ప్రయత్నాల తర్వాత భద్రతా విభాగంలో చేరతాడు.  శిక్షణ అనంతరం అతన్ని ఒక మిషన్ లో నియమిస్తారు పై అధికారులు.  కానీ అంతలోనే అతనొక హత్య కేసులో ఇరుక్కుంటాడు.  అదే సమయంలో అర్జున్ తనకు అప్పగించిన మిషన్ అతను అనుకున్న దానికంటే గొప్పదని, తనకు కావాల్సిందని నిజం తెలుసుకుంటాడు.  ఇంతకీ అర్జున్ తెలుసుకున్న నిజం ఏమిటి, అర్జున్ ఆ మిషన్ ను ఎలా పూర్తి చేశాడు అనేదే సినిమా. 

విశ్లేషణ :

ఒక స్పై థ్రిల్లర్ కథను తీసుకుని, దాన్ని తెలుగు నేటివిటీకి దగ్గరగా, ప్రతి దశలోనూ సినిమాలోని ప్రతి అంశం నమ్మశక్యంగా ఉండేలా కథ, కథనాన్ని రాసుకున్న చిత్ర టీమ్ ను ప్రత్యేకంగా అభినందించాలి.  ఇక తెలుగులో తీసే స్పై థ్రిల్లర్స్ తక్కువ స్టాండర్డ్స్ లో ఉంటాయని తక్కువ చూసే వారికి ఈ చిత్రం సరైన సమాధానమనే చెప్పొచ్చు.  ఎందుకంటే సినిమా సాంకేతికంగా అంత గొప్ప స్థాయిలో ఉంది మరి.  నిజంగా లిమిటెడ్ బడ్జెట్ తో అంత బాగా సినిమాను రూపొందించడం కష్టమైన పనే.  కథనంలో వచ్చే మలుపు ప్రేక్షకుడు ఆద్యంతం సినిమాతో పాటే ప్రయాణించేలా చేశాయి.  ఎక్కడా సినిమా ఓవర్ అనిపించదు.  లాజికల్ గా కూడ తప్పులు కనబడవు. అంతర్జాతీయ స్థాయి క్వాలిటీని కలిగి ఉన్న ఈ సినిమా మంచి చిత్రాన్ని చూసిన అనుభూతిని ఇవ్వడమే కాక మంచి ఎంటర్టైన్మెంట్ కు కూడ ఇస్తుంది. 

నటీనటుల పనితీరు :

ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది హీరో అడివి శేష్ గురించి.  రా ఏజెంట్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు.  హ్యాండ్సమ్ గా కనిపిస్తూనే, డైనమిక్ పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.  రచయితగా మంచి కథను తయారుచేసిన ఆయన నటుడిగా ముందుండి సినిమాను నడిపాడు.  శోభిత ధూళిపాళ మొదటి సినిమాలోనే మంచి నటన కనబర్చగా ప్రకాష్ రాజ్, వెన్నెల కిశోర్ లు తమ పాత్రలు న్యాయం చేశారు.  

సాంకేతిక విభాగం :

దర్శకుడు సాయి కిరణ్ తిక్క లిమిటెడ్ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ కనబడేలా సినిమాను రూపొందించాడు.  షాట్స్ మేకింగ్ లో అతని స్టైలిష్ థింకింగ్ కనబడింది.  కథలోని ప్రతి మలుపుని సమయానుగుణంగా అందిస్తూ ఆకట్టుకున్నారాయన.   శానియల్ డియో సినిమాటోగ్రఫీ చిత్రాన్ని లావిష్ గా కనబడేలా చేసింది.  శ్రీచరణ్ పాకాల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.  ఎడిటింగ్ గొప్పగా ఉంది.  ఏ సన్నివేశం ఎంత పరిధిలో ఉండాలో అంతే పరిధిలో ఉంది.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

కథనం 

దర్శకత్వం 

సినిమాటోగ్రఫీ

అడివి శేష్ నటన 

మైనస్ పాయింట్స్ :

కొంత నెమ్మదిగా సాగిన సెకండాఫ్ 

చివరగా : ఈ 'గూఢచారి' గురి తప్పలేదు.