డయాబెటిక్ రెటినోపతి కనిపెట్టే గూగుల్ ఏఐ మోడల్

డయాబెటిక్ రెటినోపతి కనిపెట్టే గూగుల్ ఏఐ మోడల్

టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ డయాబెటిక్ రెటినోపతిని కనిపెట్టే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ ను అభివృద్ధి చేసింది. ఇది మానవ రెటినా నిపుణులంత కచ్చితంగా డయాబెటిక్ రెటినోపతిని కనిపెట్టగలదని గూగుల్ బల్లగుద్ది చెబుతోంది. త్వరలోనే వెరిలీతో కలిసి భారత్ లోని క్లినిక్ లలో ఈ డయాబెటిక్ రెటినోపతి విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు గూగుల్ గ్లోబల్ అఫెయిర్స్ ఎస్వీపీ కెంట్ వాకర్ తన బ్లాగులో పోస్ట్ పెట్టారు. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని వెరిలీ జీవ శాస్త్ర పరిశోధనలు, అభివృద్ధి రంగంలో పనిచేస్తోందని వాకర్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. వారిలో మూడో వంతు మందికి శాశ్వత అంధత్వానికి దారితీసే డయాబెటిక్ రెటినోపతి సమస్య ఉంది. ‘కొత్తగా కనిపెట్టిన టెక్నాలజీ సాయంతో డాక్టర్లు, వైద్య సిబ్బంది తక్కువ సమయంలో ఎక్కువ మంది రోగులను పరీక్షించవచ్చు. సమయానికి డయాబెటిక్ రెటినోపతిని కనిపెడితే చాలా మందిని అంధత్వం నుంచి కాపాడవచ్చని‘ వాకర్ చెప్పారు. అంధత్వానికి నివారణ ఉన్నప్పటికీ చాలా మంది డయాబెటిక్ రెటినోపతి పరీక్షలని సమయానికి చేయించుకోని కారణంగా కంటి చూపు కోల్పోతున్నారు.

‘కొద్దిమంది నేత్ర నిపుణులు, సిబ్బందికి మాత్రమే డయాబెటిక్ రెటినోపతి పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉంది. ఈ సమస్యను ఏఐ ద్వారా పరిష్కరించవచ్చని’ వాకర్ పేర్కొన్నారు. ‘తగినంత మంది నేత్ర వైద్యులు లేని ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల్లో ఈ టెక్నాలజీతో వెలుగు నింపవచ్చని’ వాకర్ తెలిపారు. కొన్నేళ్ల క్రితం భారత్, అమెరికాలలోని నేత్రవైద్య నిపుణులతో కలిసి ఈ మోడల్ పై పరిశోధనలు ప్రారంభించింది.  వారు డాక్టర్లకు డయాబెటిక్ రెటినోపతి వ్యాధిగ్రస్తుల కళ్ల వెనుక ఉన్న దృశ్యాలను విశ్లేషించడంలో సాయపడే ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ‘ఫలితాలు చాలా బాగున్నాయి. ఏఐ అందించే ప్రయోజనాలను ప్రతి ఒక్కరి అందుబాటులోకి వచ్చేలా చూడాలని’ వాకర్ అభిప్రాయపడ్డారు. 

గూగుల్ చాలా ఏళ్లుగా తన ఏఐ పరిశోధనలు, ఇంజనీరింగ్ ను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సమాజానికి ఉపయోగపడేలా కృషి చేస్తోంది. ఇండోనేషియాలో అక్రమ చేపల వేట, భారత్ లో వరదల హెచ్చరికలు, న్యూజిలాండ్ లో స్థానిక పక్షి జాతుల సంరక్షణ వంటి కార్యక్రమాల్లో తోడ్పాటు నందిస్తోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వ్యాపార సంస్థలతో కలిసి ఆరోగ్య రంగంలో వివిధ కార్యక్రమాలకు ఏఐ ద్వారా సాయపడాలని టెక్ దిగ్గజం భావిస్తోంది. ఇందుకోసం ఇటీవలే ‘గూగుల్ ఏఐ ఇంపాక్ట్ ఛాలెంజ్’ను లాంచ్ చేసింది. దీనికి ఎంపికైన సంస్థలకు గూగుల్ ఏఐ నిపుణుల సహకారంతో పాటు గూగుల్.ఆర్గ్  ఏర్పాటు చేసిన 25 మిలియన్ డాలర్ల నిధి నుంచి ఆర్థిక సాయం కూడా అందిస్తారు.