తప్పేముంది..? ఓటర్ల జాబితా పబ్లిక్ డాక్యుమెంట్..

తప్పేముంది..? ఓటర్ల జాబితా పబ్లిక్ డాక్యుమెంట్..

డేటా లీక్ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతూనే ఉంది... ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో ఓవైపు తెలంగాణ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తుంటే.. తమ డేటా కొట్టేప్రయత్నం జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఓటర్ల జాబితా పబ్లిక్ డాక్యుమెంట్, అందులో ఫోటోలు ఉండవన్నారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు సమాచారం కోరితే ఎన్నికల సంఘం స్పందిస్తుందన్నారు. టీడీపీ యొక్క సేవా మిత్రా యాప్‌ అభివృద్ధి చేసిన ఐటి గ్రిడ్స్ కంపెనీకి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. ఐటీ గ్రిడ్స్ దగ్గర ఉన్న ఓటర్ల జాబితా అందరికి అందుబాటులో ఉంటుంది. ఇది ఎవరైనా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చనున్నారు. తాము ప్రతీ రాజకీయ పార్టీకి కూడా ఇస్తాము. ఆందోళన చెందుతున్నంత వరకు ఏ డేటా ఉల్లంఘన లేదు మరియు అక్రమమైన కార్యకలాపాలు లేవు అని ఆయన వివరించారు. 

ఓట్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన గోపాల కృష్ణ ద్వివేది. బోగస్ ఓట్లు అంటూ దరఖాస్తులు వచ్చాయి... కానీ, ఓట్లను మాత్రం తొలగించలేదన్నారు. సీ డాక్ నుంచి సర్వర్ సమాచారం వచ్చాక పోలీసులకు వివరాలు ఇస్తామని తెలిపారు. కొత్త ఓట్లలో డూప్లికేట్ ఓట్లను, చనిపోయిన వారిని గుర్తించామని.. ఈఆర్వో డేటాలో ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన ప్రతీ రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం జాబితా ఇచ్చిందని గుర్తుచేసిన గోపాల కృష్ణ ద్వివేది.. రాష్ట్రంలో 74 నియోజకవర్గాల్లో 40 వేల ఓట్లను మాత్రమే ఇప్పటి వరకు తొలగింపునకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. ఇప్పటి వరకు 10 వేల ఓట్లను మాత్రమే తొలగించామని క్లారిటీ ఇచ్చారు. అయితే, 6 లక్షల ఫారం 7 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందని తెలిపారు గోపాల కృష్ణ ద్వివేది.