టీడీఎల్పీ నేతగా ఆయనుంటేనే ధైర్యం: గొరంట్ల

టీడీఎల్పీ నేతగా ఆయనుంటేనే ధైర్యం: గొరంట్ల

చంద్రబాబునాయుడే టీడీఎల్పీ నేతగా ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. ఆయన ముందుంటేనే తమకు ధైర్యంగా ఉంటుందన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇవాళ మీడియాతో మాట్లాడారు. 

పార్టీ పరిస్థితిపై గతంలోనే తాను ఆందోళన వ్యక్తం చేసినా.. తన మాటలు పట్టించుకోలేదని అన్నారు. అయినా మళ్లీ చెబుతానని.. పార్టీ బాగు కోసం సూచనలు చేస్తామని చెప్పారు. 'టెక్నాలజీ కొంప ముంచిందా..? నేల విడిచి సాము చేశామా..? అనే విషయంలో విశ్లేషించుకోవాలి. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కులాల ప్రస్తావన వచ్చింది.. ఇదేమన్నా దెబ్బ తీసిందా..? అనే అంశం పైనా విశ్లేషిస్తాం'

జగన్‌ ప్రమాణ స్వీకారానికి ఫోన్‌ చేసి చంద్రబాబును ఆహ్వానించడాన్ని ప్రస్తావిస్తూ ఇంటికి వచ్చి చంద్రబాబును జగన్‌ ఆహ్వానించి ఉంటే బాగుండేదని చౌదరి అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.